కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి
జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): కావేరమ్మపేటలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం కావేరమ్మపెట యువకులు, ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారని, ఆ తర్వాత ఖాళీగా ఉండే ఈ భవనాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయించాలని కోరారు. ప్రస్తుతం బాదేపల్లి గంజ్ ఏరియాలో అద్దె భవనంలో కొనసాగుతున్న జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వ భవనంలోకి మార్చడం వల్ల ప్రభుత్వ ఆస్తులు సద్వినియోగం అవుతాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ భవనం 44వ జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉండటమే కాకుండా, వాహనాల నిలుపుదలకు విశాలమైన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉందని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదని వివరించారు. ప్రజల సౌకర్యార్థం ఈ భవనంలోకి కార్యాలయాన్ని మార్చేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో గోనెల అంజి, బుక్క నవీన్, పిట్టల నరేష్, చింతకుంట లక్ష్మణ్, చటమోని రమేష్, ఆసిఫ్, రమేష్, చంటి, శివ, మహేష్ గౌడ్, రాజేష్, చంద్రకుమార్, మున్ను తదితరులు పాల్గొన్నారు.



