కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ

కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు దుండగులు చొరబడ్డారు. సిబ్బంది లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను డిస్ ప్లే పెడుతుండగా లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు తోపులాట జరిగింది. ఈ క్రమంలో సిబ్బం దిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి .వీరిలో ఒకరికి బాడీలోకి బుల్లెట్ వెళ్లడం తో అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దోపిడీ దొంగలు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు, రెక్కీ నిర్వ హించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, బంగారం ఎంతమేర ఎత్తుకెళ్లారన్నది తేలలేదు. దుండగుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాగా దోపిడీ దొంగల్లో ఒకరు హనుమాన్ మాలధారుడు కావడం గమనార్హం.