నేడు విజయదశమి
రాజోలి, అక్టోబర్ 11 (జనంసాక్షి) :
* దసరా ఉత్సవాలకు సిద్ధమైన ప్రజలు
* సందడిగా మారిన మార్కెట్లు
తెలుగువారి ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమిని శనివారం ఉమ్మడిజిల్లా వాప్తంగా జరుపుకోనున్నారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని రోజుకొక అలంకారంలో పూజించిన తర్వాత విజయదశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రోజులు 9 రూపాల్లో యుద్ధం చేసి, అతడిని వధించిన సందర్భంగా 10వ రోజున ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకునేదే విజయదశమి.
* దసరా నేపథ్యం
మహిషాసురుడు బ్రహ్మవరం వల్ల గర్వితుడై ముల్లోకాలను బాధ పెడుతుంటే ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు. త్రిమూర్తులు సకల లోక పావని దుర్గామాతను స్తుతించారు. దుర్గామాత తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం సాగించి తొమ్మిదో రోజు మహిషాసురున్ని సంహరిస్తుంది. ఆరోజు ఆశ్వయుజ మాసం శుధ్ధ నవమి. సకల జగత్తుకు మూలం. త్రిమూర్తులకు శక్తిప్రదాత. త్రిలోకేశ్వరి సకలాభీష్ట ప్రదాయిని దుర్గామాత దుష్ట శిక్షణ చేసిన మరునాడు జరుపుకున్న విజయోత్సవమే విజయ దశమి. ఈ రోజు పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయం. ఆ రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి. అందుకే దుష్ట శిక్షణపై విజయంగా భావించి విజయ దశమిగా మారినట్టు పురాణాలు ప్రవచిస్తున్నాయి.
* ఆయుధ పూజ
మహిషాసురుణ్ని వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలు తమ ఆయుధాలను అందించడంతో ఆదిశక్తి మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్నది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుణ్ని వధించి విజయవిలాసిగా మూర్తిమత్వాన్ని చాటుకుంది. అందువల్లే ఆయుధాల్ని పూర్వం రాజులు అలంకరించి పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లకు పూజలు చేయడం, పూలతో అలంకరించడం, ఫ్యాక్టరీలు, భారీ వాహనాల ముందు జంతు బలి ఇవ్వడం ఆనవాయితీ.
* పాలపిట్ట దర్శనం
పండుగనాడు పాలపిట్టను చూడడం ప్రత్యేకత. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనబడిందని, అప్పటినుంచి వారికి విజయాలు కలిగాయని, అది విజయదశమి రోజు కావడంతో అనాటి నుంచి దశమినాడు పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తున్నది. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. పండుగరోజున ఈ పాలపిట్టను చూడడం ఎంతో అదృష్టంగా ప్రజలు భావిస్తారు. పాలపిట్టతోపాటు జంబి చెట్టు దర్శనం చేసుకోవడం ఈ రోజు మరోప్రత్యేకం.
* మార్కెట్లో సందడి..!
విజయదశమిని పురస్కరించుకొని కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. పండుగ వేళ పండ్లు, పూలు, తమలపాకులు, పలురకాల స్వీట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా పట్టణాల్లో బంతి, చామంతి, గులాబీపూల విక్రయాలు జోరందుకున్నాయి. కిలో పూల ధర రూ. 100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు. వీటితోపాటు జమ్మి ఆకు, మామిడి ఆకులు తదితర పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు.
* దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకొనే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ రోజున చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.