చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు కృషి చేస్తాం

జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి
చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం పట్టణంలోని 12 వార్డుల్లో పర్యటించి రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామని జేఏసీ చేర్యాల పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి, కో కన్వీనర్ బస్వగళ్ల రమేష్ తెలిపారు. గురువారం చేర్యాల పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంగా జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం అనేక ఉద్యమాల నిర్వహిస్తూ ధర్నాలు రాస్తారోకోలు దీక్షలు చేపట్టినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా అశాస్ర్తియంగా విడదీసి చేర్యాలను ముక్కలు చెక్కలుగా చేసి ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎన్నికల ముందు ఇచ్చిన రెవెన్యూ డివిజన్ హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈప్రాంత ప్రజల ఆకాంక్ష చిరకాల కోరికను నెరవేర్చడం కోసం త్వరలో 12 వార్డుల్లో కమిటీలు ఏర్పాటు చేసి జేఏసీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు కృషిచేసిన జేఏసీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట జేఏసీ నాయకులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, సుంకోజు రజిత, నర్సయ్య, శ్రీనివాస్ ఉన్నారు.



