పక్కాగా గ్రామ ప్రణాళిక అమలు

share on facebook

గ్రామాల అభిశృద్దికి విరాళాల సేకరణ
కార్యాచరణ చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   గ్రామస్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌తో పాటు మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యతను ఇస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను విడుదల చేశారు. అలాగే దాతల నుంచి విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. ఆయా గ్రామాల్లో ఉన్నతవర్గాల నుంచి విరాళాలు సేకరించి గ్రామాలను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వెచ్చించి పనులు చేసే అవకాశాలు ఉన్నా జనాభా పెరుగుదల, అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి అందిన నిధులు సరిపోవడం లేదు. ఈదశలో ఆయా గ్రామాల్లో దాతల నుంచి విరాళాలు సేకరించి గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంపై సంబంధిత కమిటీ సభ్యులు దృష్టి సారించారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల నుంచి విరాళాల సేకరణతో పాటు గ్రామాల్లో ఉన్న వివిధ రకాల పన్నులను వసూలు చేసి గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను అభివృద్ధి చేసే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కమిటీ సభ్యులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీని కోసం ప్రతి కమిటీలో 15-30 మంది వరకు సభ్యులు ఉండేలా ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతాయుతంగా నిధులు ఖర్చు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌ తన సందేశంలో స్పష్టం చేశారు. గ్రామాలను ప్రగతిపథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించారు. సాధారణ నిధుల నుంచి రూ.3.6 కోట్లు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.5.36 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం రూ.8.96 కోట్లను జిల్లాకు కేటాయించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు గుర్తించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత జిల్లాలో ప్లయింగ్‌ స్కాడ్‌ బృందం పర్యటిస్తుంది. ప్రణాళికలో లోటు పాట్లు ఏమైనా ఉంటే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల అభివృద్ధికి 30 రోజుల
కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులను ఆర్థిక క్రమ శిక్షణతో పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం ఆదేశించింది. విడుదలైన నిధులు, దాతల నుంచి సేకరించిన విరాళాలు, గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులపై దృష్టి సారించి స్వీయ క్రమ శిక్షణ పాటిస్తూ పనులను పూర్తి చేయాలని సూచించింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిదులకు శిక్షణను ఇచ్చారు. ఈ మేకు గ్రామాల్లో పనులు జరిగిలే పర్యవేక్షిస్తున్నారు.

Other News

Comments are closed.