ప్రకృతిని ప్రేమించే పండుగలు

share on facebook

 మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి పూజించడం మన వారసత్వానికి నిదర్శనం. అందుకే ఆకాశం,నీరు,గాలి, నిప్పు,భూమిలనుపంచభూతాలుగా పూజిస్తున్నాం. మనజీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ సంస్కృతితో పెనవేసుకుని ఉంది. పుట్టలను,చెట్లను, పూలను పూజించే గొప్పతనం మనది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండగలు ఈ కోవలోకే వస్తాయి. ప్రకృతిని పూజించే మహత్తరమైన వేదికలు ఇవి. ఇలాంటి ప్రకృతి రమణీయకతకు బతుకమ్మ నిదర్శనం. ఇదో రకంగా గౌరీపూజను చేయడం.. అమ్మవారికి  శరన్నవరాత్రులు ఎలా జరుపుతామో తెలంగాణాలో 9రోజులపాటు బతుకమ్మ వేడుకలను అలా జరపడం ఆనవాయితీ. ఈ 9 రోజుల్లో కూడా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా గుమిగూడా ఆడుకోవడం…ఆడపిల్లలను ఇంటికి రప్పించి వేడుక చేయడం పెద్ద సరదా.  తెలంగాణ లోగిళ్లలో కులాలకు అతీతంగా బతుకమ్మను పెద్ద ఎత్తున ఆడుతారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు, నవర్రాతుల దేవీ పూజలతో అంతటా సందడి కనిపించనుంది. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకొనే బంగరు కల్పవల్లిగా బతుకమ్మను తెలంగాణవాసులు భావిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి- అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్నిపేర్చి కూర్చడం కళాత్మకంగా చేస్తారు.  అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణగాథలు, ఇతిహాస ఘట్టాల్ని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుపుబొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొంటారు. బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతి నిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని  భావించి, వివిధ పుష్పాలతో పేర్చి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. బతుకమ్మగా పిలిచే గౌరమ్మ అయినా, దేవీరూపాలలోని పదుగురు అమ్మలయిన లలితాదేవి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, పార్వతి, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్దని, అపరాజితాదేవి అందరూ పరాశక్తికి చెందిన ప్రధాన, ఉపప్రధాన, అంశాత్మక స్వరూపాలేనని మన పురాణాలు చెబుతు న్నాయి. భూమివిూది మట్టి, చెట్టు, నీరు, నిప్పులలోనే కాదు, గ్రామగ్రామాన వెలసిన ఎల్లమ్మ, బాలమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మలు.. వంటి అమ్మలంతా ఆమెకు ప్రతీకలు, ప్రతిరూపాలే. ఇంతేనా, సమస్త సృష్టికే ఆమెనే మూలం.మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది.అందుకే మన జీవన విధానం, సామాజిక ఏకత్వానికి మన పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. జాతి చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయ వైభవానికి ఈ ఉత్సవాలు ఉపకరిస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగలో ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ కట్టుబాటు, ఆచారాలు ఇమిడి ఉన్నాయి.  సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్యాత్మిక సరళికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఈ పరంపర లోకే ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు కూడా వస్తాయి.  ఆటపాటల నేపథ్యంగా, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. ప్రాణశక్తి, ప్రాణధాత్రి, ప్రాణెళిశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం.  బతుకమ్మ అంటే  బతుకునివ్వడంతో పాటు,
సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతి- బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం- తొమ్మిది. నవ విధ భక్తి మార్గాలకు, నవ నిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పుష్పాలతో తొమ్మిది వరసల్లో అమరుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో- మొదటి, రెండో రోజుల్లో బొడ్డెమ్మగా, మూడో రోజు లక్ష్మీదేవిగా, నాలుగో రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. అయిదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా, ఏడో రోజు చకినాల బతుకమ్మగా, ఎనిమిదో రోజు దుర్గమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సంప్రదాయం. తొమ్మిది రోజులూ గౌరీదేవి ‘పూలమ్మ’గా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ, ఆరాధన చేస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికి- అంటే, శివుడి వద్దకు పంపుతూ, సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ తరలిరమ్మని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పుంత బతుకమ్మ. జలాల్లో సమ్మిళితమై, చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలతో బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయడం, నిమజ్జనంతో అనంత ప్రకృతిలో సంలీనం కావడం అనేవి- జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలుగా భావించాలి. నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపం ఆమె. ‘ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి. ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. .

Other News

Comments are closed.