బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్
` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టుతో సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక్కడి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు చేరుకుని ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా మృతి చెందినట్లు గుర్తించారు. మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో బలగాలు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

