ఇరాన్‌ అల్లర్ల వెనుక ట్రంప్‌

` దేశంలో నిరసనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణం
` ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర
` ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం
` అందుకే ట్రంప్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నాం
` నిరసనల్లో పాల్గొన్నవారు అమెరికా కోసం పనిచేసిన వారే
` విధ్వంసానికి కారణమైన వారిని విడిపెట్టం
` మండిపడ్డ సుప్రీం లీడర్‌ ఖమేనీ
టెహ్రాన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు మద్దతిచ్చిన ట్రంప్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నామన్న ఆయన.. ఇరాన్‌లో ఆందోళనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఖమేనీ తొలిసారి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర దాగుంది. ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం. ఆందోళనల వేళ అమెరికా అధ్యక్షుడు స్వయంగా వ్యాఖ్యలు చేస్తూ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. అందుకే ఆయన్ను నేరస్థుడిగా పరిగణిస్తున్నాం. నిరసనల్లో పాల్గొన్నవారు అమెరికా కోసం పనిచేసిన వారే. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశారు. ఎంతో మందిని గాయపరిచారు’’ అని సుప్రీం లీడర్‌ ఖమేనీ పేర్కొన్నారు.
వారిని విడిచిపెట్టం..
ఆందోళనకారులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మందుగుండు సామగ్రిని వినియోగించారని ఖమేనీ ఆరోపించారు. యుద్ధం వైపు దేశాన్ని తీసుకెళ్లాలని అనుకోవడం లేదన్నారు. నేరుస్థుల్లో విదేశీయులూ ఉన్నారన్నారు. నేరస్థులెవరినీ విడిచిపెట్టబోమని, కేసులను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
3 వేల మంది మృతి..
ఆందోళనల్లో పాల్గొన్న వారిలో దాదాపు 800 మందికి ఇరాన్‌ మరణశిక్ష అమలు చేస్తుందనే వార్తలు వచ్చాయి. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలు జోక్యం చేసుకోవడం తదితర పరిణామాల తర్వాత ఇరు దేశాలు వెనక్కి తగ్గినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ స్పందిస్తూ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు ఇరాన్‌ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 3వేలకు పైగా మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిరచాయి.

ఎటు చూసినా ఆందోళనలే
` ఇరాన్‌ పరిస్థితులను వివరించిన భారతీయులు
` రెండు విమానాల్లో పలువురి తరలింపు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇరాన్‌లో పరిస్థితులు క్షీణించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. తొలివిడతలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు దిల్లీకి చేరుకున్నారు. అనంతరం వారు ఇరాన్‌లో పరిస్థితుల గురించి విూడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. విదేశాంగశాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. ఈ రెండు వారాలపాటు క్షణమొక యుగంలా గడిచిందన్నారు. తిరిగి భారత్‌కు వస్తామనుకోలేదని.. ఇటువంటి క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ వారి కోసం విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. చాలా రోజులుగా తమ వారితో ఎటువంటి సంప్రదింపులు లేవన్నారు. ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందామని.. కానీ మోదీ ప్రభుత్వం చొరవతో తమ కుటుంబసభ్యులు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇరాన్‌లో ప్రస్తుతం 10 వేలమందికి పైగా భారతీయులు (విద్యార్థులు సహా) నివసిస్తున్నట్లు అంచనా. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరిని సంప్రదించేందుకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పనిచేస్తుండడం ఇందుకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని చేరుకునేందుకు ఎంబసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని విదేశాంగ శాఖ వారికి సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది.