మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా(జనంసాక్షి):భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా` అస్సాంలోని గువాహటి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కి.విూ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమక్షంలో కోటా (రాజస్థాన్‌) నుంచి నాగ్దా (మధ్యప్రదేశ్‌) మధ్య తుది పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్‌లో ఉంచినా.. రైలు గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొణకకపోవడాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.ఈ రైల్లో 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన (ఏసీ) స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇందులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ వంటి వాటిని ఇందులో అనుమతించరు.

బెంగాల్‌ అభివృద్ధికి మమతే ప్రధాన అడ్డంకి
` తృణమూల్‌ను సాగనంపే సమయం వచ్చింది
` చొరబాటు దారులకు ఆ పార్టీ అండతో నష్టం
` అవినీతి కారణంగా ప్రజలకు చేరని పథకాలు
` బీహార్‌ తరవాత ఇప్పుడు బెంగాల్‌ వంతు
` మాల్దా సభలో ప్రధాని మోడీ
కోల్‌కతా(జనంసాక్షి):బెంగాల్‌ ప్రజల పట్ల ఏమాత్రం కనికరం లేని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి చొరబాట్లకు తృణమూల్‌ అండగా నిలవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌ను జెన్‌జీ తరం విశ్వసిస్తోందని.. ఈసారి బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బృహన్‌ ముంబై ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనంతరం తొలిసారి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. రాష్ట్రంలో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు.. పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని ఆరోపించారు. బెంగాల్‌లోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన కోరిక అని అన్నారు. పేద ప్రజల కోసం పంపిన సొమ్ములను టీఎంసీ నేతలు లూటీ చేస్తున్నారన్నారు. ’టీఎంసీ ప్రభుత్వం నాకు, బెంగాల్‌ ప్రజలకు శత్రువుగా మారుతోంది’ అని తీవ్రంగా ఆక్షేపించారు మోదీ. బెంగాల్‌ విజన్‌తోనే 2047 నాటికి అభివృద్ధి భారత్‌ విజన్‌ సాకారమవుతుందని ప్రధాని అన్నారు. ఒడిశా, త్రిపుర, అస్సాం, బిహార్‌లో బీజేపీ వరుస విజయాలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు బెంగాల్‌లో సుపరిపాలనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ఇటీవల చారిత్రక విజయం సాధించిందని, ముఖ్యంగా ముంబై పురపోరు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిందని గుర్తుచేశారు. ’ఈసారి బెంగాల్లో మార్పు అవసరముందని నేను చెబుతాను.. బీజేపీ సర్కార్‌ కావాలి’ అని విూరు చెప్పండి.. అంటూ సభికులను మోదీ ఉత్సాహపరిచారు. కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అడ్డుకున్న ఏకైక రాష్ట్రం బెంగాల్‌ అని, పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అందనీయడం లేదని మోదీ చెప్పారు. ఇలాంటి క్రూర ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందన్నారు. మాల్దాలో ఫ్యాక్టరీలు లేకపోవడంతో మాల్దా, ముర్షీదాబాద్‌ ప్రజలు ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని, మామిడి రైతులు ప్రభుత్వ విధానాలు, వరదల సమయంలో చూపిస్తున్న నిర్లక్ష్యంతో ఎంతో నష్టపోతున్నారని అన్నారు. గంగా, ఫులాహార్‌ నదీ తీర కోత కారణంగా వేలాది మంది ఇళ్లు కోల్పోయారని, రక్షణ గోడ కోరుతూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలను టీఎంసీ సర్కార్‌ ఖాతారు చేయడం లేదని విమర్శించారు. కేంద్రం పంపిన వరద సహాయక నిధులు లబ్దిదారులకు చేరలేదని కాగ్‌ నివేదకలు కూడా చెబుతున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ అనుచిత విధానాలకు స్వస్తి చెప్పి, వరదల నివారణకు సమగ్ర పరిష్కారం కల్పిస్తామని, మామిడి సాగు చేసే మాల్దా రైతుల కోసం కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలపడేలా చేస్తామని హావిూ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని, బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే భాజపా ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం సాధించిందని, ఇక బెంగాల్‌కు సమయం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు అసలైన సవాల్‌ చొరబాట్లేనని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బెంగాల్‌కు అతిపెద్ద సవాల్‌ చొరబాట్లేనని.. వీటి కారణంగానే మాల్దా, ముర్షీదాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చొరబాట్ల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందని, వీటిని అరికట్టడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎటువంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. రాష్టాన్రికి వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్దిదారులకు చేరలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్రం నిధులను తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొల్లగొడుతోందని.. ఆ పార్టీ అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని అన్నారు. టీఎంసీ అధికారం కోల్పోయి.. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తూర్పు భారత్‌ దశాబ్దాలుగా వెనకబడి ఉందన్నారు.