ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్
` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం
` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రాజనర్సింహ
` నాగర్‌కర్నూల్‌లో రూ.40 కోట్ల విలువైన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన
నాగర్‌కర్నూల్(జనంసాక్షి): ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన ఆయన రూ.40 కోట్ల విలువైన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సభకు వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. విద్యార్థులు సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థుల చదువు సమాజాభివద్ధికి దోహదపడాలన్నారు. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు
పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. పీపీపీ పద్ధతిలో తులసి థెరప్యూటిక్స్‌తో కలిసి స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఒక పెద్ద వక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో.. మన శరీరానికి స్టెమ్ సెల్స్ అంతే ముఖ్యమని వివరించారు. స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలను, అవయవాలను తయారు చేయొచ్చని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు. మన శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్ప్పుడు భాగాన్ని రిపేర్ చేసే అద్భుతమైన శక్తి.. మూల కణాలకు ఉంటుందని వెల్లడించారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఈ స్టెమ్ సెల్స్‌కు ఉందని తెలిపారు. క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడేవారికి ఈ చికిత్స సంజీవని లాంటిదని చెప్ప్పుకొచ్చారు. ఆయా వ్యాధుల వల్ల శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ కొత్తగా సష్టించేందుకు ఈ చికిత్స ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనే అందుబాటులో ఉందని… అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాన్యులకు కూడా అత్యాదునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో స్టెమ్ సెల్స్‌పై లోతైన పరిశోధనలు జరుగుతాయని చెప్ప్పుకొచ్చారు. పరిశోధనల ఫలితంగా, భవిష్యత్తులో నిమ్స్‌లోనే పేషెంట్లకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలుగుతామని తెలిపారు. త్వరలోనే ఈ ల్యాబ్ రీసెర్చ్ ఫలాలు ప్రజలకు అందుతాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.



