ప్లే ఆఫ్స్‌ చేరకపోవడం ఇదే తొలిసారి

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఏటా ఘనంగా నిర్వహించే టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇలా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్‌, సెవిూస్‌ లేదా ఫైనల్స్‌ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్‌గా అవతరించింది. గతేడాది సైతం ఫైనల్స్‌ చేరి చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి ఇప్పుడిలా దారుణంగా విఫలమైంది.చెత్త ప్రదర్శనతో ఐపీఎల్‌ 2020ని 7వ స్థానంతో ముగించింది. కరోనా వైరస్‌ కారణంగా సుమారు ఆరు నెలలు వాయిదా పడిన ఐపీఎల్‌ 2020 యూఏఈలో దిగ్విజయంగా ముగిసింది. ఆగస్టులోనే యూఏఈ వెళ్లిన చెన్నైకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. తొలుత జట్టులో ఇద్దరు సభ్యులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మిగతా ఆటగాళ్లను ఇంకో వారం రోజులు తమ హూటల్‌ గదులకే పరిమితం చేశారు. దాంతో ధోనీసేనకు సరైన ప్రాక్టీస్‌ సమయం దొరకలేదు. పైగా అప్పుడే సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ లాంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నారు. ఇవే చెన్నై వైఫల్యానికి ప్రధాన కారణాలు. ఆటగాళ్లు కోలుకున్నాక తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబైని ఓడించడంతో జట్టు బాగానే ఉందనుకున్నారు. కానీ తర్వాత నుంచే పరిస్థితి మారిపోయింది. ఓపెనర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ పర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ పరుగులు చేయలేకపోయాడు. స్టార్‌ ఆటగాడు అంబటి రాయుడు గాయం ముంచింది. మిడిల్‌ ఆర్డర్‌ ఆకట్టుకోలేదు. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నారు. రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌ రాణించగా.. ఆశలు పెట్టుకున్న దీపక్‌ చహర్‌ విఫలమయ్యాడు. ఒక్క బౌలర్‌ కూడా వికెట్లు తీయలేక పోయారు. ఇక గెలుపు ఖాయమే అనుకున్న రెరడు మ్యాచులలో చెన్నై ఓడిపోయింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ పుంజుకోవడంతో వరుసగా మూడు సాధించినా లాభం లేకపోయింది. మహీ సారథ్యం కూడా ఓటమికి ఓ కారణమే చెప్పాలి. చెన్నై అనూహ్య ఓటమితో ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, యాజమాన్యంపై అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయిన చెన్నై.. ఐపీఎల్‌ 2021కి ప్రక్షాళన చేయనుంది. జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయొచ్చు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో జరగనున్న మెగా వేలం కోసం చెన్నై ఆసక్తిగా ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. వచ్చే సీజన్‌కు ముందు ఆ జట్టు కొందరు ఆటగాళ్లను రిలీజ్‌ చేయొచ్చు. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. షేన్‌ వాట్సన్‌ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెరట్‌ ప్రకటించాడు. డ్వేన్‌ బ్రావో కూడా గాయాల కారణంగా ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లూ ఆడలేకపోయాడు. ఐపీఎల్‌ 2020కి దూరమైన హర్భజన్‌ సింగ్‌, సురేష్‌ రైనా.. ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయిన కేదార్‌ జాదవ్‌, కర్ణ్‌ శర్మ, పియూష్‌ చావ్లాలను చెన్నై రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. వీరితోపాటు మురళీ విజయ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, లుంగీ ఎంగీడి లాంటి ఆటగాళ్లను సైతం వదులుకునే అవకాశం లేకపోలేదు. వయసు విూద పడిన ఆటగాళ్లను వదిలేసుకొని యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటామని.. వచ్చే పదేళ్లకుగానూ జట్టు అవసరాలకు సరిపడేలా ఆటగాళ్లను ఎంపిక చేస్తామని కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఇంతకు ముందే చెప్పాడు. వచ్చే సీజన్‌ తర్వాత ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్‌లోనూ ఆడే అవకాశాలు లేవు. దీంతో అతడి స్థానంలో జట్టును నడిపేందుకు సమర్థుడైన ఆటగాడి కోసం చెన్నై అన్వేషణ సాగనుంది. ఇప్పటికే ఆ జట్టు అభిమానులు కేన్‌ విలియమ్సన్‌ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతణ్ని వదులుకునే అవకాశాలు లేవు. ఇక ఒక్కో జట్టు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తే.. ఎంఎస్‌ ధోనీతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజాలను సీఎస్‌కే అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ముగ్గురికే ఛాన్స్‌ ఉంటే.. ధోనీ, గైక్వాడ్‌, జడేజాలకే పరిమితం కావొచ్చు.

Other News

Comments are closed.