పెద్దధన్వాడ నై.. నెల్లూరు సై
ఇథనాల్ ఫ్యాక్టరీకి తలూపిన కొడవలూరు
ప్రజాభిప్రాయ సేకరణలో నెగ్గిన యాజమాన్యం
అనుకూలంగా ఉన్నవారి అభిప్రాయాలతోనే నిర్ణయం
వ్యతిరేకులు రాకుండా కంపెనీ నిర్వాహకుల జాగ్రత్తలు
పలువురు రైతుల ఆవేదనకు సమాధానమిచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐఏఎస్
పెద్దధన్వాడ ప్రాంతానికి ‘కాలుష్య’ ముప్పు కనుమరుగైనట్టే..!
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని 14 గ్రామాల్లో హర్షాతిరేకలు
రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ నుంచి (మిద్దెల సత్యనారాయణ, జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి)
‘కాలుష్యం’ మమ్మల్ని కాటేయబోతోందని ముందుగానే పసిగట్టిన పెద్దధన్వాడ పెద్ద తిరుగుబాటే చేసింది. దాదాపు పది నెలల పాటు అన్నీ త్యాగం చేసి ఉద్యమాన్ని వీడకుండా పోరాడిరది. ఫలితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ‘పీడ’ ఆ గ్రామానికి తొలగిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా ఎన్నోసార్లు పనులకు పూనుకున్నా.. ప్రజలంతా ఏకమై అడ్డుకుని చివరకు విజయం సాధించారు. ఒక్క ఇటుక కూడా పడనివ్వకుండా ఇతర ప్రాంతానికి తరిమికొట్టారు. అవును.. ఇది నిజం..! అదే కంపెనీ యాజమాన్యం పక్క రాష్ట్రంలో ఇథనాల్ పరిశ్రమను నెలకొల్పేందుకు సకల ఏర్పాట్లు చేసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణలోనూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అనుకున్న విధంగానే నెగ్గింది. ఫ్యాక్టరీ వ్యతిరేకించేవారిని రాకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకెళ్లిన యాజమాన్యం.. కలెక్టర్ సమక్షంలోనే పరిమిత వ్యక్తులతో ఫ్యాక్టరీకి జై కొట్టించుకుంది. పలువురు రైతులు తమ ఆవేదనను వినిపించినా.. ప్రభుత్వ అధికారుల హామీతో కంటితుడుపు చర్యలతో స్థానికులను ఎట్టకేలకు ఒప్పించుకోగలిగింది.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు, రేగడిచెలిక, బొడ్డువారిపాలెం, దగదర్తి మండలంలోని చౌటపుత్తేడు, ఊచగుంటపాలెం, తడకలూరు, అల్లూరు మండలంలోని నార్త్ ఆములూరు గ్రామం ‘ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద 1123.50 హెక్టార్లు (2776.23 ఎకరాలు) ఇండస్ట్రియల్ పార్కులో మిగిలిన అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త పారిశ్రామిక రంగాల ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారం భారీ బందోబస్తు నడుమ జరిగింది. రాచర్లపాడు గ్రామంలో రోజుకు 370 కిలో లీటర్ల ఇథనాల్, 7.25 మెగావాట్ల సహా ఉత్పత్తి విద్యుత్ ప్లాంట్‌తో కూడిన ధాన్యం ఆధారిత డిస్టిల్లరీ పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐఏఎస్ హాజరుకాగా, ఇతర అధికారులు, పలువురు స్థానిక నాయకులు సహా మొత్తం వందమందిలోపే ఈ కార్యక్రమంలో కనిపించారు. ప్రజాసంఘాల నేతలను, పౌరహక్కుల నాయకులను ఒకరోజు ముందస్తుగానే అరెస్టు చేసి నిర్బంధించగా.. ఫ్యాక్టరీ అనుకూల వ్యక్తులను మాత్రమే అక్కడికి అనుమతించారు. పట్టుమని పదిమంది రైతులు కూడా దర్శనమివ్వలేదు. వచ్చినవారిలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. కలెక్టర్ వెంటనే స్పందించారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. దీనిపై యాజమాన్యానికి కూడా సూచనలు చేశారు. కాలుష్యంతో ఆరోగ్యాలు చెడిపోతాయని, పశుపక్ష్యాదులు కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతాయని మరికొందరు సందేహించగా.. కంపెనీ నిర్వాహకులు అలాందేమీ లేదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఆరోగ్యాలు చెడిపోతే పరిస్థితేంటని రైతులు ప్రశ్నించగా.. కలెక్టర్ సమాధానమిచ్చారు. హెల్త్ కార్డులు మంజూరు చేయించేలా చూస్తామని హామీనిచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణకు రైతులు ఎంతమంది వచ్చారో అంతకు రెండిరతలు పోలీసులు బందోబస్తు నిర్వహించడం గమనార్హం.
వ్యతిరేక నినాదాలు వినిపించకుండా..
రాచర్లపాడులో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ 260 కోట్ల రూపాయల నిధులతో 27.5 ఎకరాల్లో నిర్మించనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో పలు వివరాలు వెల్లడిరచినవారు.. ఫ్యాక్టరీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారిని రాకుండా అడ్డుకున్నారు. కేవలం యాభై మందిలోపే స్థానికులు, రైతులు ఉన్నారు. అందులో అనుకూలంగా ఉన్నవారినే అనుమతించి ఈ అభిప్రాయ సేకరణ చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభావిత గ్రామాల రైతులు కూడా పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగింది. అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలూ, స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా హెల్త్ కార్డులు ఇత్యాది సౌకర్యాలు కల్పిస్తామని హామీనివ్వడంతో ఫ్యాక్టరీకి మార్గం సుగమమైంది. రైతులు, స్థానికులు కొందరు వెలిబుచ్చిన అనుమానాలను నివృత్తి చేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వం తరపున హామీనివ్వడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థానిక జనం జైకొట్టారు. దీంతో పెద్ద ధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇటుక పడకుండానే ఇతర ప్రాంతానికి తరలిపోయినట్టుగా స్పష్టమవుతోంది. రాచర్లపాడు వద్ద ఏర్పాటు కాబోయే ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టు పక్కల గ్రామాలను దత్తత తీసుకోవాలని, చుట్టూ అధికంగా చెట్లు నాటాలని, కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి.
రైతుల అనుమానాలివే..
` ఇథనాల్ పరిశ్రమ వస్తే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మూగజీవాలు చనిపోతాయి.
` పుట్టబోయే పిల్లలకు కూడా ఇతర వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది.
` సాయంత్రం కాగానే వ్యర్థాలు బయటకు రావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతారు.
` దీనివల్ల వ్యవసాయ భూములు బీడువారుతాయి.
` మా గ్రామాల్లోకి కాలుష్యం, వాసన వస్తే శ్వాసకోస సమస్యలు వస్తాయి.
పబ్లిక్ హియరింగ్‌లో పెల్లుబికిన ప్రజాగ్రహం
` రైతుల, ప్రజల వ్యతిరేకతకు తలొగ్గిన ఇథనాల్ యాజమాన్యం
` తోకముడిచిన మెస్సర్స్ సువీర బయో ఫ్యూయల్స్ కంపెనీ
` మోమిన్ పేటలో పరిశ్రమ ఏర్పాటు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన
` ‘జనంసాక్షి’కి కృతజ్ఞతలు చెప్పిన శాస్త్రవేత్తలు, జేఎస్సీ నాయకులు
వికారాబాద్ జిల్లా బ్యూరో డిసెంబర్ 30 (జనంసాక్షి):
ఇథనాల్ పరిశ్రమ రాకను తీవ్రంగా వ్యతిరేకించి రైతులు దేశ చరిత్రలోనే తొలి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 30 పరిశ్రమలు మంజూరయితే రైతు ఉద్యమంతో మొదటిసారిగా ఒక కాలుష్య పరిశ్రమ రద్దయింది. కాలుష్య పరిశ్రమలు రద్దుచేసి రైతువాణి కేంద్రానికి వినిపించారని వక్తలు కొనియాడారు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో నిర్మాణం చేయనున్న మెస్సర్స్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంజూరైన ఇథనాల్ పరిశ్రమను యాజమాన్యం ఉపసంహరించుకుంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈ పరిశ్రమ ఏర్పాటును మర్పల్లి మోమిన్ పేట మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు విషయమై కార్యనిర్వాహక సారాంశంను యాజమాన్యం చదివిన తర్వాత రైతులు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. మోమిన్ పేటలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కన్నెగంటి రవి రైతులకు వివరించారు. దీంతో రైతులు ఒక్కసారిగా చేతులుపైకి ఎత్తి పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించారు. మోమినిపేటలో దాదాపు పది ఎకరాల 30 గుంటల భూమిలో 100 కోట్ల అంచనా వ్యయంతో మెర్సర్స్ సువీర బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజాజీవన విధానంపై ప్రభావం చూపే విషయమై శాస్త్రవేత్తలు వక్తలు మారు వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్, కర్నేగంటి రవి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ గీత, ఏఐకేఎం కన్వీనర్ మహేందర్, పిడిఎస్ నాయకులు శ్రీకాంత్ స్వరాజ్యం వేదిక కోఆర్డినేటర్ అమరేశ్వర్, కాలుష్యకర వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ సురేష్ రైతులకు ప్రజలకు వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధులు గర్భ శిశువుపై ప్రభావం పుట్టిన పిల్లల్లో బరువు తగ్గడం గొంతు నొప్పి తల తిరగడం వాంతు విరోచనాలు కావడం ఆయాసం రావడం వంటివి జరుగుతాయని అన్నారు. గాలి నీరు భూమి కలుషితమైన కారణంగా మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. పరిశ్రమకు 10 కిలోవిూటర్ల దూరం వరకు పంటల దిగుబడి తగ్గుతుందని నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నీటి ఒప్పందం లేబర్ లైసెన్స్ కాలుష్యం స్థానికులకు ఉపాధి అవకాశాలపై స్పష్టమైన హావిూ ఇచ్చిన తర్వాతే పరిశ్రమ మంజూరు ఉంటుందని ఇవేవీ చూడకుండా నిబంధనలకు వ్యతిరేకంగా పరిశ్రమలు మంజూరు చేశారని అన్నారు. రోజుకు లక్ష లీటర్ల వరకు నీళ్లు అవసరం ఉంటాయని ఈ నీటిని చెరువులు వాగులు వంకల నుంచి వినియోగిస్తారని విషయమై స్పష్టత లేదని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రోజుకు లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తే భవిష్యత్తులో ఏర్పడి అవకాశం ఉందని అన్నారు. దీంతో ప్రభుత్వం పై అదరపు భారం పడుతుందని అన్నారు. ఇథనల్ పరిశ్రమలకు సరిపోను బియ్యం నూకలు మొక్కజొన్న గోధుమలు దేశంలో ఉత్పత్తి కావడం లేదని అన్నారు. ఇప్పుడే వీటి కొరత ఉంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పరిశ్రమలు పెట్రోలు ఉత్పత్తి చేసిన దేశంలో ఎక్కడ పెట్రోల్ ధర తగ్గలేదని 15 రూపాయలకు లీటర్ పెట్రోల్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ హావిూ నెరవేరలేదని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్ ఆర్డిఓ తహసిల్దార్ తో పాటు మెస్సర్స్ సువీర యాజమాన్యంతో పాటు వేదిక దగ్గర ఎలాంటి సంఘటన జరగకుండా వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి సిఐ వెంకటేష్ మర్పల్లి మోహన్పేట ఎస్సైలు ప్రత్యేక పోలీసు బృందాలను దింపారు. మొత్తానికి ప్రజాభిప్రాయ సేకరణ ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.



