ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించండి

` సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక
` లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆన్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాలని సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్‌లైన్‌ వేదికలకు స్పష్టం చేసింది. లేదంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ అడ్వైజరీ జారీ చేసింది.అసభ్యకర, అశ్లీల, అనుచిత, చట్టవిరుద్ధ కంటెంట్‌పై సామాజిక మాధ్యమ వేదికలు కఠినంగా వ్యవహరించడం లేదని ఐటీ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని ఆయా వేదికల్లో అప్‌లోడ్‌, ప్రచురణ, లేదా వ్యాప్తి చేస్తే.. అందుకు సామాజిక మాధ్యమ సంస్థలు సహా ఆయా ప్రచురణ వేదికలదే బాధ్యత అని గుర్తుచేస్తున్నట్లు అడ్వైజరీలో పేర్కొంది. నిబంధనలు పాటించకుంటే.. ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సహా ఇతర చట్టాల కింద ఆయా వేదికలు, సంబంధిత సంస్థలు, వినియోగదారులకు తీవ్ర పరిణామాలు తప్పవని ఉద్ఘాటించింది.