రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు

share on facebook

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే పాలకులు మకిలి చేష్టలకు పాల్పడితే అది అభాసు పాలుకాక తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దానిగురించి పాలకులు చాలా గొప్పగా అభివర్ణించారు. అంతకు ముందు రోజే రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరిగింది. గవర్నర్ల పాత్రకు నీతులు ఆపాదించారు. పార్లమెంటులో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విపక్షం దీనిని బహిష్కరించిన వేళ మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేవిగా, గవర్నర్‌ వ్యవస్థను అభాసుపాలు చేసేదిగా కనిపించాయి. బిజెపి వల్లించే నీతి సూత్రాలకు,ఆచరణకు ఏ మాత్రం పొంతనలేని వ్యవహారాలు జరగుతున్న తీరు సామాన్యులను కూడా కలవరపాటుకు గురిచేశాయి. మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లడం.. ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్రపతి పాలన విధించడం జరిగి పోయాయి. అయితే అక్రమాల కేసు మూటగట్టుకున్న అజిత్‌ పవార్‌ను నమ్ముకుని రాత్రికిరాత్రే గవర్నర్‌ పాలనను ఎత్తేసి, ఫడ్నవీస్‌ సిఎంగా ప్రమాణం చేయడం ఎంత అనైతికమో చెప్పక్కర్లేదు. బిజెపికి ఇది రుంచించ వచ్చేమో గానీ చూసే వారికి మాత్రం తీవ్ర ఆగ్రహం కలిగించేదిగా ఉంది. గవర్నర్‌ కోశ్యారి కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి విధులు నిర్వహించారు. ఇంతటి అనైతిక రాజకీయాలు నడపడం ద్వారా బిజెపి ఎలాంటి సందేశం ఇవ్వదల్చుకుందో చెప్పాలి. మహారాష్ట్రలో అనైతికంగా, అప్రజాస్వామికంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి పన్నిన ఎత్తులన్నీ సుప్రీం తీర్పుతో చిత్తయ్యాయి. అటు సుప్రీంకోర్టులోనూ, ఇటు ప్రజాబాహుళ్యంలోనూ ఆ పార్టీకి మొట్టికాయలు తప్పలేదు. బలనిరూపణకు ఈ నెలాఖరు వరకు గవర్నర్‌ సమయం ఇచ్చిన దరిమిలా కొనగోళ్లకు పాల్పడడం ద్వారా ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని బిజెపి వేసిన ఎత్తులను సుప్రీం చిత్తుచేసింది. బుధవారం సాయంత్రం లోగా పఢ్నవీస్‌ ప్రభుత్వం సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం, ఆయన రాజీనామా చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే ఈ ఘటనతో గవర్నర్‌ వ్యవస్థను,రాజ్యాంగ వ్యవస్థలను నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు శివసేన-ఎన్‌సిపి- కాంగ్రెస్‌ కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపై నిలిచి అసలు సంఖ్యాబలం తమదేనని నినదించారు. ముంబయిలోని ఓ స్టార్‌ ¬టళ్లలో 162 మంది కూటమి సభ్యులతో పెరేడ్‌ నిర్వహించి ఫిరాయింపులకు పాల్పడబోమని ప్రమాణం చేయించడం ద్వారా తమ సంఖ్యాబలాన్ని ప్రపంచానికి తెలియచేశారు. తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని ప్రకటించిన బిజెపి అనైతికంగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కింది. ఇలా అక్రమంగా గద్దెనెక్కి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి అధికార దాహంతో రాష్ట్రపతి, గవర్నరు కార్యాలయాలను సైతం దుర్వినియోగపర్చిన బిజెపి దేశ ప్రజలను క్షమాపణలు కోరాలి. ఎందుకంటే రాజ్యాంగం గురించి గొప్పగా నీతులు చెప్పిన నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. రాజ్యాంగ దినోత్సవం రోజునే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం యాధృచ్ఛిమే అయినా బిజెపి కుట్రలు దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అజిత్‌ పవార్‌ బిజెపితో చేతులు కలిపేందుకు ఆసక్తి కనబర్చిన తర్వాతే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఫడ్నవీస్‌ చెప్పడం సిగ్గుచేటు. ఆ పార్టీ ఎలాంటి లేఖ ఇవ్వకుండా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు చూపకుం డానే గద్దెనెక్కిన తీరు క్షమించరాని నేరం. బిజెపి పెద్దల ఆశిస్సులు లేకుండా ఇదంతా జరిగిందను కోరాదు. ఎందుకంటే ప్రమాణంచేసిన వెంటనే మోడీ సహా అంతా అభినందించిన వారే. ఎన్‌సిపి మొత్తం తమవైపు వస్తుందని భావించామని చెప్పుకోవడం సిగ్గుచేటు కాక మరోటి కాదు. శివసేన మళ్లీ నంబర్‌ గేమ్‌

ఆడుతోందని, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఆ పార్టీతో ఒప్పందమేదీ తాము చేసుకోలేదని చెప్పిన వారు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటుకు ఉత్సాహం చూపారో ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి. నైతిక విలువలను, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడం ద్వారా బిజెపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందనే చెప్పాలి. సంఖ్యా బలం లేనందున తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని, బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పిన వారు ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారో వివరణ ఇచ్చుకోవాలి.

రాజకీయ కొనుగోళ్ల నిరోధానికి సభలో బలనిరూపణ అవసరమని మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాల పై మంగళవారం వెలువరించిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన దరిమిలా ఇక భవిష్యత్‌ లో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా చూడాలి. ప్రజాస్వామ్య విలువలను, మంచి పాలన కోరుకునే పౌరుల హక్కులను కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించటం అత్యవసరమని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మొత్తంగా మహారాష్ట్రలో రేపు ఎవరు గద్దెనెక్కబోతున్నారన్న దానికంటే, ప్రజాస్వామ్యం దెబ్బతినిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పదవీకాంక్ష నాయకులను దేనికైనా సిద్ధపడేట్టు చేస్తుందని అందుకు బిజెపి మినహాయింపుకాదని మహారాష్ట్ర పరిణామాలు సూచించాయి. అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు గతంలో కాంగ్రెస్‌, ఇటీవల పలు రాష్టాల్ల్రో బీజేపీ అడ్డదారులు తొక్కడం ద్వారా తామేవిూ అతీతులం కాదని కాషాయదళ నేతలు నిరూపించుకున్నారు.

రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా వ్యవహరించి, విలువలను పరిరక్షించాల్సిన పెద్దలు ఈ మహానాటకంలో పోషించిన పాత్ర భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోనున్నది.

Other News

Comments are closed.