పసిడి,రజతానికి రెక్కలు

` లక్షన్నర దాటిన బంగారం, మూడు లక్షలు దాటిన వెండి
న్యూఢిల్లీ(జనంసాక్షి): బంగారం, వెండి ధరలు దూసుకెళుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల అవతారం ఎత్తి తమ వీరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాయి. పసికూనపై ఓపెనర్లుగా దిగిన బ్యాటర్ల మాదిరిగా పరుగుల కసిని తీర్చుకుంటున్నాయి. ఆకాశమే హద్దుగా సిక్సర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే స్కోరుబోర్డుపై తొలిసారి వెండి రూ.3 లక్షల మార్కును నమోదు చేయగా.. తానేవిÖ తీసిపోను అన్నట్లుగా బంగారం రూ.1.50 లక్షల మార్కును చేరుకుంది. తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుగోళ్లు జరిపిన వారు దీన్ని చూసి కేరింతలు కొడుతుండగా.. తగ్గితే కొందామని భావిస్తున్న మధ్యతరగతి వ్యక్తి ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాడు.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి నెల డెలివరీ కిలో వెండి ధర మంగళవారం మరో రూ.9,674 పెరిగి రూ.3.19 లక్షలకు చేరువైంది. ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ఫిబ్రవరి డెలివరీ ఒక్క రోజులోనే రూ.2,560 పెరిగి రూ.1.48 లక్షలకు చేరింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం మధ్యాహ్నానికి 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.1.50 లక్షలు దాటింది. వెండి రూ.3.15 లక్షల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,714 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. వెండి ఔన్సు 94.37 డాలర్లుగా ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ 91 మార్కును దాటడంతో ఆ ప్రభావం కూడా దేశీయంగా వీటి ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.
సురక్షితమని భావించి..
మొన్నటికి మొన్న వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన ట్రంప్.. మరోవైపు ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అంతలోనే అమెరికా భద్రతను సాకుగా చూపుతూ గ్రీన్‌లాండ్‌పై మనసుపడిన ట్రంప్.. ఆ దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దూకుడుగా అడుగులు వేస్తున్నారు. తద్వారా ప్రపంచాన్ని మరోసారి అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సురక్షితమని భావిస్తూ బంగారం, వెండి పైకి పెట్టుబడులు రావడమే వీటి ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ వర్తకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతుండడంతో వైట్ గోల్డ్‌కు ఎప్పుడూలేనంత డిమాండ్ ఏర్పడింది.