భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్


లండన్(జనంసాక్షి):భారత్`ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ డీల్ దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. దీనిని ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉంది. మనం చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. కొందరు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పిలుస్తారు. దీనివల్ల కోట్లాదిమంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి`దిగుమతి చేసుకొనే సౌలభ్యం కలుగుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో 25శాతానికి సమానం” అని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా వెల్లడించారు. వచ్చే వారం ఆమె భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.తాము పెద్దన్నగా భావించే అమెరికాతో గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా దేశాలకు విభేదాలు తలెత్తాయి. నాటో మిత్ర దేశాలని కూడా చూడకుండా ట్రంప్ సుంకాలు విధించారు. గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని 7 దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్‌పై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటికీ దిగిరాకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉర్సులా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.