చలాన్ల పేరుతో వెహికిల్ కీ లాగొద్దు
` పోలీస్ వేధింపులపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్(జనంసాక్షి):వాహన చలాన్లపై వాహనదారులను వేధింపులకు గురి చేయవద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదంది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. గత సంవత్సరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఈ`చలాన్లు 25,93,152 ఉన్నాయి. ఈ రెండు రకాల చలాన్ల మొత్తం విలువ రూ. 239.37 కోట్లు అని వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది. కొద్దిరోజుల క్రితం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అరైవ్`అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే.. వారి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం ఆటోమెటిక్‌గా చెల్లింపు జరిగిపోయేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు.
టికెట్ ధరల పెంపును 90 రోజుల ముందే ప్రకటించాలి
` సినిమా టిక్కెట్ రేట్లు పెంపుదలపై హైకోర్టు ఆగ్రహం
` హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్‌కు నోటీసులు
హైదరాబాద్,జనవరి20(జనంసాక్షి): సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోం శాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు సుమోటో కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. గత ఆదేశాలను ధిక్కరిస్తూ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. హోంశాఖ అధికారులు గత ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వాదించారు. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ల రేట్లు పెంచిన విషయాన్ని కోర్టు దష్టికి తీసుకురాకుండా దాచిపెట్టారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్‌కు హైకోర్టు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్`1955 ప్రకారమే ధరల నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్ప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మళ్లీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.



