2 వేల నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమన చర్య: మంత్రి జగదీశ్‌ రెడ్డి

share on facebook

సూర్యాపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దుచేసిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. రూ.2 వేల నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమన చర్య అని, ఇది దేశాభివృద్ధి దోహదపడేది కాదని విమర్శించారు. పెద్ద నోట్లు ఎందుకు రద్దుచేశారో, నల్లధనం ఎంత వెలికితీశారనేది ప్రజలకు ఇప్పటికీ తెలియదన్నారు. రూ.2 వేల నోట్ల రద్దుతో దేశంలో పేదరికం ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రజల కోసం కాకుండా కొంత మంది వ్యక్తుల కోసమే పరిపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను పేదరికంలో ఉంచాలనే ఫ్యూడల్ ఆలోచనలలో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేశారని వెల్లడించారు. పెద్దనోట్ల ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు ప్రచారం చేయడంలేదని ప్రశ్నించారు. రేషన్ దుకాణంలో ప్రధాని ఫొటో లేకుంటే గగ్గొలుపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. నోట్ల రద్దుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రిజర్వ్‌ బ్యాంకును ముందు పెట్టి ప్రజల కళ్లుగప్పుతున్నారని విమర్శించారు. బీజేపీ పతనానికి, నోట్ల రద్దుకు అంతర్గతంగా దాగిఉన్న రహస్య అజెండా ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉపయోగంలేని రూ.2 వేల నోటును ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడెందుకు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడిదారుల రహస్య అజెండాలో భాగమే రూ.2వేల నోట్ల రద్దని ఆరోపించారు.

Other News

Comments are closed.