30మంది కార్మికుల మృతికి కేసీఆరే కారణం

share on facebook

– ఆయనపై కేసుపెట్టి కఠినంగా శిక్షించాలి

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు

సంగారెడ్డి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ఆర్టీసీ కార్మికుల మృతికి కారణమైన సీఎం కేసీఆర్‌ను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు అన్నారు. సోమవారం కాంగ్రెస్‌ నాయకురాలు గీతారెడ్డి ఇంటికి వీహెచ్‌ వెళ్లారు. ఈ సమయంలో ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. సమ్మె సమయంలో ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ కోర్టును మోసం చేసిన కేసీఆర్‌కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా అటు న్యాయ వ్యవస్థను, ఇటు కార్మికులను మోసం చేసి ముప్పై మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వద్ద రూపాయి లేదని కోర్టుకు తెలిపిన కేసీఆర్‌.. ఇప్పుడెలా వేల కోట్ల వాగ్దానాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ముందుగానే ఈ వాగ్దానాలు చేస్తే ముప్పై మంది ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు దక్కేవి కదా అని పేర్కొన్నారు. ఇదే సమయంలో శంషాబాద్‌లో వైద్యురాలి హత్య ఘటనపై వీహెచ్‌ స్పందించారు. ఈ కేసులో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని వీహెచ్‌ కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులైపారిస్తున్నారని, మద్యం మత్తులోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే మద్యం విక్రయాలు అదుపులోకి తేవాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.