అచేతనంగా రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి

మంత్రి డీఎల్‌ ఆందోళన

హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి): రాష్ట్రంలోని వ్యవస్థలన్ని  2004-09 మధ్య కాలంలో నాశనమైయ్యాయని వైద్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు మరింత పతనం కాకూడదనే తన తపన  అని ఆయన అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లా డారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి సంబంధించి ఆయన వివరాలు అందించారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా మాతా శిశు మరణాలు తగ్గినప్పటికీ, ఈ సంఖ్య మరింత తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని   అచేతనంగా ..

చెప్పారు. కుటుంబ నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రభాగాన ఉందని ఆజాద్‌ అభినందించారని మంత్రి డీఎల్‌ చెప్పారు. ఎన్‌హెచ్‌ఆర్‌ఎం పథకంలో రాష్ట్ర వాటా గణానీ చెల్లించకపోవడం వల్లే కేంద్ర నిధులను వనియోగించుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 17 నాటికి నిధులను వినియోగించుకోలేకపోతే వాటిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  డెంగ్యూ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సుప్రీం కోర్టులో కేసు ఉన్నందు వల్లన మంత్రుల సమావేశంలో ‘నీట్‌’ అంశంపై చర్చించలేకపోతున్నామని ఆయన చెప్పారు.  విశాఖ పట్నంలో వైరాలజీ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలో వంద సీట్లను అదనంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

టిడిపి సీనియర్‌ నేత ఎర్ర న్నాయుడు మృతిపై మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఎర్రన్నాయుడు కారుకు ప్రమాదం జరిగిన వెంటనే తీసుకువెళ్లిన ఆసుపత్రి వాహనంలో గ్యాస్‌ సిలిండర్‌ లేదని విచారణలో తేలిందని మంత్రి అన్నారు.  ఆసుపత్రుల వ్యవహారం ఏ విధంగా ఉందో ఈ సంఘటన వల్ల తెలుస్తుందన్నారు.  ఆసుపత్రుల్లో  కనీస సౌకర్యాలు లేవని దీనితో స్పష్టమవుతోందని అన్నారు.  వ్యవస్థల పతనానికి ఈ సంఘటనలు నిదర్శనమన్నారు. తాను ఎవరికి వ్యతిరేకిని కాదని ఆయన చెప్పారు.  ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది  అని మంత్రి అన్నారు.  రాష్ట్రంలో నేతల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి పార్టీ పటిష్ఠత కోసం అందరూ కృషి చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.