ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్
` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం
న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ వార్షిక బడ్జెట్ ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని విరుపులు ఉండేలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. పెద్దగా ప్రభావితం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. అయితే ఆదివారం ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బ్జడెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమకు ఊరట లభించేలా బ్జడెట్ ఉంటుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలు నిజం చేసే దిశగానే కేంద్రం బ్జడెట్ ఉండనుందని సమాచారం. పన్నుల విషయంలో కీలక మార్పులు జరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను నిబంధనలో పలు మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, సీనియర్ సిటిజన్లకు లాభం చేకూరేలా ఈ మార్పులను కేంద్రం తీసుకువస్తుందని సమాచారం. పన్ను నిర్మాణాన్ని సరళీకతం చేయడం, పన్ను విషయంలో భారాన్ని తగ్గించడం, పారదర్శకత, డిజిటల్ పన్ను వ్యవస్థను ఎంచుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండనుందన్న వార్తలు వస్తున్నాయి. పాత ఆదాయపు పన్ను చట్టం 1961 నుంచి.. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వరకు సరళమైన పరివర్తనలపై ప్రభుత్వం దష్టి సారిస్తోంది. సత్వర పన్ను వాపసులు, సరళీకత సమ్మతి కీలక లక్ష్యాలుగా ఉండనున్నాయని సమాచారం. వార్షిక సమాచార ప్రకటన, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం వంటి వ్యవస్థలు పన్ను దాఖలును సులభతరం చేశాయి. డిజిటల్ వ్యవస్థను మరింత నమ్మదగినదిగా, పారదర్శకంగా మార్చడంపై బడ్జెట్ 2026 దష్టి సారించే అవకాశముంది. ఏఐని సరిగ్గా ఉపయోగించినట్లయితే పన్ను రిటర్న్‌లను ఆటోమేటిక్‌గా దాఖలు చేయొచ్చని, లోపాలను తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను వాపసుల కోసం రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా సాయపడనుంది. ఆదాయపు పన్ను కేసుల వేగవంతమైన పరిష్కారంపై ప్రాధాన్యం, క్రిప్టో, డిజిటల్ ఆస్తులపై స్పష్టమైన నియమాలకు ఉపయోగ పడుతుంది. మరోవైపు.. కొత్త పన్ను విధానం వచ్చినప్పటికీ కొన్ని అంశాల్లో పాత పన్ను విధానం అందుబాటులో ఉంటుందని సమాచారం. ముఖ్యంగా గహ రుణాలు, బీమా ప్రీమియంలు, పదవీ విరమణ పొదుపులు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన పన్ను తగ్గింపులకు సంబంధించి పాత విధానాలే ఉంటాయని తెలుస్తోంది. బాగా పన్ను రాయితీ కలిగిన వారు పాత పన్ను విధానం నుంచి ప్రయోజనం పొందడం కొనసాగించవచ్చు. అయితే తక్కువ పన్ను మినహాయింపులు ఉన్న వ్యక్తులు కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన విధానాన్ని ఎంచుకోవడం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక ముఖ్యమైన నిర్ణయం అవుతుంది. విద్యా, గహ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలను నిర్వహించే కుటుంబాలకు ఈ మార్పులు ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని అందించవచ్చు. 2026లో ఆదాయపు పన్ను నియమాల మార్పు నుంచి సీనియర్ సిటిజన్లు కూడా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా పెన్షన్ ఆదాయం, వాటి వడ్డీ ఆదాయాలపై సరళీకత పన్ను విధించడం ద్వారా పన్ను దాఖలును సులభతరం చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ.. ట్యాక్స్ ప్లేయర్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందని ఆర్థిక నిపుణులు బలంగా చెబుతున్నారు. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన పన్ను విధానం పెద్దగా ప్రయోజనకారిగా లేదన్న విమర్వలు వచ్చాయి.