కొండదిగిన వెండి రూ.లక్ష క్షీణించిన కిలో ధర

రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర ఒక్కరోజులో 594 డాలర్లు (11%) క్షీణించి 4732 డాలర్లకు, వెండి ధర 36 డాలర్లు (32%) పతనమై 78 డాలర్లకు పరిమితం అయ్యాయి. ఫలితంగా రాత్రి 11.55 గంటలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.21,860 పైగా తగ్గి రూ.1,57,840కు, కిలో వెండి ధర రూ.లక్ష పతనమై రూ.2,99,000 వద్ద స్థిరపడ్డాయి. గురువారం రాత్రి ఈ ముగింపు ధరలు రూ.1,79,700, రూ.3,99,600 కావడం గమనార్హం. కమొడిటీల ట్రేడింగ్ జరిగే మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు ధర రూ.1,80,499 వద్ద ప్రారంభమై, రూ.1,83,493 వద్ద గరిష్ఠస్థాయిని తాకినా, తదుపరి రూ.1,50,849 వద్ద కనిష్ఠస్థాయిని తాకి అక్కడే ముగిసింది. 18% క్షీణించింది. కిలో వెండి మార్చి కాంట్రాక్టు ధర రూ.3,83,898 వద్ద ప్రారంభమై, రూ.3,89,986 వద్ద గరిష్ఠానికి చేరింది. తదుపరి రూ.2,91,922 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి, అక్కడే ముగిసింది. ఈ కాంట్రాక్టు 27% నష్టపోయింది.
లాభాల స్వీకరణకు తోడు
కమొడిటీస్ ట్రేడింగ్‌లో పసిడి, వెండి ధరల్లో ఒకరోజు పతనం గత 15 ఏళ్లలో ఇంతలా ఎప్పుడూ లేదని విశ్లేషణలు వస్తున్నాయి. వెండి ధర 27% ఒక్కరోజులో క్షీణించడం 2011 తరవాత ఇప్పుడే బంగారం ధర 15% తగ్గడమూ, ఇంతే.ఊహించని గరిష్ఠస్థాయులకు చేరిన లోహాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రధాన కారణం.అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో, కొన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం అయ్యింది. ఇది విలువైన లోహాల ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది.

