నామినేషన్లను సజావుగా సాగే విధంగా చూడాలి

ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్
జనం సాక్షి 31 రాయికల్ :శుక్రవారం రోజున రాయికల్ మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ… నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటిని, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వెంట వెంటనే రోజు వారీగా టీ. పోల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుటకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో రాయికల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



