అతిపెద్ద క్రికెట్ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ఆయన స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్మించాలని భావించారని.. అందుకే సర్దార్ పటేల్ పేరుతో పిలిచే ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు కోవింద్ చెప్పారు.
‘నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కూడా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే మోదీ ఈ స్టేడియం నిర్మించాలని భావించారు. కాబట్టి దీనికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించాం. ఇది పర్యావరణ హితంగా అభివృద్ధి చేసిన స్టేడియం. ఇక్కడి సౌకర్యాలు క్రీడాకారులకు మరింత మెరుగ్గా ఆడేందుకు సహకరిస్తాయి’ అని కోవింద్ తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును పెట్టారు. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో ఈ ఎన్క్లేవ్ అహ్మదాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ… ‘ఇది మోదీ కలల ప్రాజెక్టు. కాబట్టి దీనికి ఆయన పేరును పెట్టాలని నిర్ణయించున్నాం’ అని తెలిపారు.
మొతేరాలోని నిర్మించిన ఈ భారీ స్టేడియం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని రూ.800కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇందులో 1.32లక్షల మంది కూర్చొని మ్యాచ్ వీక్షించవచ్చు. పునరుద్ధరన పనుల కోసం 2015లో దీన్ని మూసేశారు. అంతకు ముందు సునిల్ గావస్కర్ ఈ మైదానంలోనే పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా ఈ స్టేడియంలో బుధవారం భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.