అది అన్నింటికి ‘ఆధార’మా..?

అడవి గుండా మేకను వెంటబెట్టుకుని ఒక బ్రాహ్మణుడు  వెళుతుంటాడు. ముగ్గురు దొంగలు చూసి ఆ మేకను కాజేయ్యాలని ఒక్కొక్కరుగా ఎదురుపడి ఆదేమిటీ? కుక్కను తీసుకెళుతున్నావంటూ ఆ బ్రాహ్మడిని ప్రశ్నిస్తారు. చివరకు ఆ బ్రాహ్మణుడు మేకను కుక్కనుకొని భ్రమపడి ఊళ్లోకి వెళితే కులస్థులంతా వెలెస్తారని భయపడి దాన్ని అక్కడే వదిలివెళ్లిపోతాడు. ఆ మేకను ఆ ముగ్గురు దొంగలు గుటుక్కుమంటూ మింగుతారు. పంచతంత్రంలోని ఈ కథలోవలే అవినీతి అంతానికి, అక్రమాల నిరోధానికి ఇలా అన్నింటికీ ఆధార్‌ ఒక్కటే సమాధానం అన్నట్లు యూపీఏ ప్రభుత్వం ఆర్భాటంగా, తహతహలాడుతూ ఆధార్‌నగదు బదిలీ పథకాన్ని శనివారం నాడు ప్రారంభించింది. దేశ పౌరుడిగా విశిష్ట గుర్తింపు పొందాలంటే ఒకే ఒక్కటి ఉంటే చాలు. అదీ ఆధార్‌కార్డు. ఈ కార్డు ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఒకటి.. అంటూ ప్రధాని ఆధార్‌ ప్రాజెక్టు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన కితాబు. ఈ కితాబు వింటుంటే ఎవ్వరికైనా కితకితలు కలగకమానదు. యావత్‌ ప్రపంచం మొత్తం  మన  దేశంలో అమలు చేస్తున్న ఆధార్‌నే ఆసక్తిగా చూసే బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఇదేమికాదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అందరికీ ఎరుకే. శనివారం నాడు పంపిణీ చేసిన ఆధార్‌కార్డుల సంఖ్యను పరిశీలిస్తే అవగతం అవుతుంది. రాజస్థాణ్‌లో దూదూలో ప్రాజెక్టు ప్రారంభమై రెండేళ్లకు ఇరవై ఒకటో కోటి ఆధార్‌ కార్డును అందజేశారు. అంటే దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉండగా ఇప్పటి వరకు జారీ అయిన  ఆధార్‌కార్డుల సంఖ్య 21 కోట్లకు చేరిందన్న మాట ఈ కార్డును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అందజేస్తూ ఇది తన భర్త రాజీవ్‌ కలల సాకారం అంటూ గొప్పలు చెప్పుకున్నారు. రాజీవ్‌ రెండే రెండు కలలు కన్నారంటూ ఒకటి ఐటీ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని, రెండోవది ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకమైనా సామాన్యుడి చెంతకు సక్రమంగా చేరాలంటే ఇలాంటి కార్డు అవసరమని, ఆయన కలలో ఇది రెండోవది అంటూ చెప్పుకొచ్చారు. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేకదా! దేశంలో అమలవుతున్న జాతీయ ఉపాధి హామీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక భద్రతా పింఛను, ఎల్పీజీ పంపిణీ, బీపీఎల్‌ హౌసింగ్‌, విద్యార్థులకు ఉపకార వేతనాలు తదితర పథకాలు అమలవుతున్నాయి. అయితే ఈ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు నేరుగా అందేందుకు ఈ ఆధార్‌ స్కేల్‌ ఎంతో ఉపయోగడుతుందనేది మాత్రం అవాస్తవం. వివిధ సంక్షేమ రూపాయలకు విభిన్న కార్డులను చూపించనవసరంలేకుండా  అన్నింటికీ ఏక గవాక్ష వ్యూహంగా ఆధార్‌ కార్డులను పౌరులకు ఇవ్వటానికి, సంక్షేమ సబ్సిడీలను నగదు రూపంలో అందజేయడానికి ఆధార్‌కార్డును ఉపయోగించడానికి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే సంక్షేమ సాయాన్ని నగదు రూపంలో అందించడానికి, సరుకు రూపంలో చేరవేయడానికి గల తేడాలోనే అసలు కిటుకుఉంది. పేదల కోసం ఎన్నింటినో సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సబ్సిడీ పేదలకు బదులు ఉన్నత వర్గాల వారే గుటకాయ స్వాహా చేస్తున్నారు. ఉదాహరణకు సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల పథకాన్నే తీసుకుందాం.. ఈ సబ్సిడీపై ఇస్తున్న ఆహార ధ్యాన్యాలలో 58 శాతం అసమర్థత, అవినీతి కారణంగా లబ్ధిఆరులకు చేరడంలేదని, బీహార్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో అయితే 75 దుర్వినియోగం అవుతుందని ప్రణాళిక సంఘం నివేదికే బయటపెట్టింది. అలాగే పుట్టుక, ధ్రువీకరణ పత్రాల నుంచి భూమి హక్కు పత్రాలు తదితర ఎన్నో వివరాలకు ఆధారాలు లేని, అసలు తమకంటూ గుర్తింపు, స్థిర నివాసం లేకుండా పొట్ట చేతపట్టుకుని ఊళ్లవెంట తిరిగే నిర్భాగ్యులకు మనదేశంలో కొదవలేదు. దీంతో ఇలాంటి నగదు బదిలీ పథకం ఆశించిన ఫలితాలనివ్వదనే విషయం అందరికీ ఎరుకే. అలాగే దేశంలో కేవలం 13 కోట్ల 50 లక్షల కుటుంబాలకే బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. మరి ఈ నగదు బదిలీ పథకం ద్వారా అందించే నగదు బ్యాంక్‌ ఖాతాలు లేని వారికి ఎలా అందుతుంది? అలాగే మార్కెట్లో సరుకుల ధరలు క్షణక్షణానికీ పెరుగుతున్న నేపథ్యంలో బియ్యం, పప్పులు, ఉప్పులు బదులు ప్రభుత్వం ఇచ్చే స్థిర నగదు ఏ మూలకు సరిపోతుంది? ఏది ఏమైనప్పటికీ అంతిమంగా ప్రభుత్వం వెనుక నీతి సూత్రం ఏమిటంటే సబ్సిడీ భారన్ని వదిలించుకోవటానికి ఆధార్‌ నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కోసం ఇన్ని కాకమ్మ కథలు చెప్పి సంక్షేమ వ్యవస్థకు తిలోదకాలు ఇవ్వటానికేనని జగమెరిగిన సత్యం. ఆధార్‌లో లోటుపాట్లను అధ్యయనం చేయకుండా నిధుల వరద పారే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఆధార్‌లో లింకు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తహతహలాడటానికి  ఓటర్లకు గాలం వేయటానికే. ఏటా మూడు వేల నుంచి 14వేల రూపాయల వరకు సబ్సిడీలు, ఇతర రూపాయల్లో ప్రజలు లబ్ధిపొందుతున్నారు. ఆధార్‌కార్డు ఆధారంగా ఈ ఓటర్లకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరంగా మారనుంది.