ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
` ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ నివాళి
` సభలో సంతాప సీఎం రేవంత్ సంతాప తీర్మానం
` సాయన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని ప్రకటన
` కేటీఆర్, పలువురు మంత్రులు తదితరుల సంతాపం
హైదరాబాద్(జనంసాక్షి): దివంగత ఎమ్మెల్యే లాస్యనందితకు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళి అర్పించింది. బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేం కలిసి పనిచేశాం. ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశాం. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించడంతో తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్య నందిత ప్రజాజీవితంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడతారని భావించాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. తలకు తీవ్ర గాయమై చనిపోయారని వైద్యులు చెప్పారు. ఆ కుటుంబానికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు. వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేస్తుంది. ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సీఎం రేవంత్ చెప్పారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తెలు మృతిచెందడం చాలా బాధాకరమని భారాస ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లాస్య నందిత మృతికి సంతాపంగా శాసనసభలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడారు. సాయన్న మరణించిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటామని అప్పటి సీఎం కేసీఆర్ సభలో హావిూ ఇచ్చారు. దాని ప్రకారం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె లాస్య నందితకు అవకాశం కల్పించారు. రాజకీయాలకు అతీతంగా అందరితో సాయన్న కలిసి ఉండేవారు. తండ్రి ఆశీస్సులు, పార్టీ అండతో నందిత బ్రహ్మాండమైన
మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో లాస్య నందిత తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో లిప్ట్ ప్రమాదం జరిగింది. అక్కడికి కొద్దిరోజులకే ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదంలో చనిపోయారు. వరుసగా పగబట్టినట్లే ఈ ఘటనలు జరిగాయి. మంచి వ్యక్తిత్వం, విద్యార్హతలు కలిగిన లాస్య నందిత ప్రజలకు ఎంతో సేవ చేస్తారని భావించాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం అని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత.. తన నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలనే తాపత్రయం, తపన ఆమెలో ఉండేదని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గుర్తు చేశారు. లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సాయన్న తన నియోజకవర్గం పేరుతోనే పిలవబడేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన సుపరిచితుడు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయన బిడ్డలు కూడా ఎంతో చురుకుగా ప్రజాక్షేత్రంలో ఉండేవారు. ప్రజల మన్ననలు పొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అందరిని ప్రత్యక్షంగా కలిసి, విూ అందరి సహకారం, సూచనలు, సలహాలు కావాలని అడిగేది. నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలని తపనతో ఉండేది ఆమె అని వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు. నేను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు సాయన్న సీనియర్ ఎమ్మెల్యే. హైదరాబాద్ పరిధిలోని మా 15 మంది ఎమ్మెల్యేల్లో వారు సీనియర్. ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నలు అడగాలి. ప్రజా సమస్యలు ఇలా లేవనెత్తాలని చెప్పి ప్రోత్సహించారు సాయన్న. సాయన్న ఎంతో అండగా ఉండేవారు. తనకు సాయన్న సహకారం అందించినట్లే నందితకు కూడా సహకారం అందించాలని అనుకున్నాం. కానీ ఆమె మరణించడం బాధాకరం. కవాడిగూడ కార్పొరేటర్‌గా గెలిచినప్పుడు కూడా ఆమె 150 మంది కార్పొరేటర్లతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ విూటింగ్‌లో కూడా లాస్య నందిత సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతో అంకితభావంతో పని చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఆమె కుటుంబానికి అండగా ఉంటాం అని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మన నుంచి దూరం కావడం బాధాకరమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన లాస్య నందిత మృతి చెందడం బాధాకరం. తన తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చాలని లాస్య నందిత రాజకీయరంగ ప్రవేశం చేశారు. లాస్యనందిత ప్రజా సేవ చేయాలనే ఆత్రుతతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మనం నుంచి దూరమైంది. అతి చిన్న వయసులో శాసనసభలో అడుగుపెట్టిన నందితకు పెద్దలంటే ఎంతో గౌరవం ఉండేది. నిజంగా హడావిడిగా ఉంటూ సందడి చేసేది ఆమె. నందిత మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు దివంగత నేత, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య కూడాచనిపోవడం చాలా బాధాకరం అన్ని విచారం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి వాయిదా వేసారు.