మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు  ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్‌లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో ఈ ప్రాంతం గుండా ప్రవహించే అంజనీ మహాదేవ్‌ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. నీటి శబ్ధానికి నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు.

అర్ధరాత్రి సంభవించిన ఈ వరదలకు ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వరద ప్రవాహానికి నది ఒడ్డున ఉన్న రెండు ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి . మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

పాల్చన్‌, రుయాడ్‌, కులాంగ్‌ గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఈ మెరుపు వరదలకు వంతెలు, రోడ్లు, పవర్‌ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. మనాలీ – లేహ్‌ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీదకు కాల్వలోని భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో అధికారులు ఈ రహదారిని మూసివేశారు. ప్రస్తుతం అక్కడ వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నేడు కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.