-->

అన్నదాతకు అన్ని వర్గాల మద్ధతు

– సర్కారు దిగిరాక తప్పదు

– కొలిమంటుకున్న జాడ

– ఏకమైన ఊరూవాడ..

– నేడు భారత్‌ బంద్‌

– మద్ధతు తెలిపిన 24 పార్టీలు

దిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన నేటి భారత్‌ బంద్‌కు 24 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, సీపీఐ(ఎంఎల్‌), పీఏజీడీ (గుప్కర్‌ కూటమి), తృణమూల్‌ కాంగ్రెస్‌, తెరాస, ఎంఐఎం, ఆప్‌, జేడీఎస్‌, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్‌ బ్లాక్‌, ఎస్‌యూసీఐ (సీ), జ్వరాజ్‌ ఇండియా పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి. మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్‌ జరుగుతుందని రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే.మరోవైపు, కేంద్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఇప్పటికే ఐదు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. మరోసారి ఈ నెల 9న రైతు సంఘాలతో కేంద్రమంత్రులు చర్చలు జరపనున్నారు.

ఆ నాలుగు గంటలే బంద్‌: రైతు సంఘాలు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఈ నెల 8న తలపెట్టిన బంద్‌ను నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్‌ జరుగుతుందని ప్రకటించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బంద్‌ వేళలు నిర్ణయించినట్లు రైతుసంఘాలు పేర్కొన్నాయి.మరోవైపు రైతు సంఘాలతో ఇప్పటి వరకు కేంద్రం జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు యథాతథంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దేశరాజధాని సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళన 12వ రోజుకు చేరింది. వీరి ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రేపటి బంద్‌కు 14 రాజకీయ పార్టీలు బాసటగా నిలిచాయి. బంద్‌లో పాల్గొంటామని ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు రైతులు ఆందోళన చేస్తున్న సింఘు ప్రాంతాన్ని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం సందర్శించారు. రైతులకు మద్దతుగా యూపీలో ధర్నా చేపట్టిన సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన 12వ రోజూ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సింఘు ప్రాంతాన్ని సందర్శించారు. గత కొన్ని రోజులుగా అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా రైతులను పరామర్శించారు. మరోవైపు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో అన్నదాతలు తమ ఆందోళనను సోమవారమూ కొనసాగిస్తున్నారు. వారు రాత్రంగా రోడ్డుపైనే నిద్రించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్నదాతలకు సంఘీభావంగా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అలాగే సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే రైతులకు బాసటగా నిలిచారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్ని సవాల్‌ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సేవలు అందిస్తానని తెలిపారు. హరియాణాలో భాజపాతో కూడిన అధికార కూటమిలోని జేజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా నిలిచారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. లండన్‌లో ప్రవాస భారతీయుల్లోని కొన్ని వర్గాలు వాహన ర్యాలీ నిర్వహించాయి. దీంతో నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మరోవైపు లండన్‌లోని హై కమిషన్‌ ముందు కొందరు నిరసన ప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను నిలువరించే క్రమంలో కొంతమందిని అరెస్టు చేశారు.ఇక నూతన వ్యవసాయ బిల్లుల రద్దే లక్ష్యంగా రైతులు పిలుపునిచ్చిన ‘భారత్‌ బంద్‌’కు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అనేక పార్టీలు, సంఘాలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. తాజాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), ఎన్డీయేలో భాగమైన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. అయితే, మానవతా దృక్పథంగా ‘భారత్‌ బంద్‌’ జరగనున్న డిసెంబరు 8న వివాహా కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.