అన్యాయాన్ని అడ్డుకోండి దామోదరకు విద్యార్థుల వినతి

నిజామాబాద్‌, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీకి, నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ఒక వినతి పత్రాన్ని అందజేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీకి వచ్చిన డిప్యూటీ సిఎంకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నవీన్‌, పిడిఎస్‌యు నాయకులు రవికుమార్‌, సౌందర్య, వైఎస్సార్‌ విద్యార్థి సంఘం నాయకులు చరణ్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పుప్పాల రవి, టిఎస్‌ జేఏసి నాయకులు శ్రీకాంత్‌, బిసివిఎస్‌ నాయకులు, బిఎస్‌ఎఫ్‌ నాయకులు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశాయి.తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఇచ్చారని, మిగిలిన నిధులను వెంటనే మంజూరు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. సెట్‌ ఫలితాలు వచ్చిన తర్వాతనే యూనివర్సిటీలో నియామకాలు చేపట్టాలని కోరారు. జిల్లా కేంద్రంలో మహిళ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ పరిధిలో ఉండే ఆదిలాబాద్‌ జిల్లా కళాశాలల గుర్తింపును తె.యూ పరిధిలోకి తీసుకురావాలని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. నూతనంగా మెయిన్‌ క్యాంపస్‌లో కోర్సులను ప్రారంభించాలని, సామాజిక కోర్సులను ప్రవేశపెట్టాలని, భిక్కనూర్‌లో ఉన్న పిజి సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.