అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

– ఉమ్మడి నల్గొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
– విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
– కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న జగదీష్‌ రెడ్డి
యాదాద్రి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : తనపై నమ్మకంతో రెండోసారి మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని, ఆయన సూచనలతో ఉమ్మడి నల్గోండ జిల్లాతో పాటు రాష్ట్రంలో విద్యాశాఖను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంత్రి మంగళవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పదవి తర్వాత తొలిసారిగా యాదాద్రి వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండోసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి ని పరుగులు పెట్టించామని చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపించామని, అందుకే తొమ్మిది స్థానాల్లో గులాబీ ఎమ్మెల్యేలు విజయం సాధించారని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీ వైపే వున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాపై ప్రేమతో నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నా తోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సహకారం మరువలేనిదని మంత్రి జగదీష్‌ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.