అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి విమర్శించారు. సోమవారం ఆర్‌అండ్‌ బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపితే వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. గతంలో ఉద్యోగులకు టిఆర్‌ఎస్‌ అండగా నిలబడిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు సహోసపేతమైన పాత్రను పోషించారని ఆయన అన్నారు. ఆంధ్రప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు, విద్యార్థులపై కేసులు గురిచేస్తూ తెలంగాణలో ఆటవిక పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ఎ.ఎస్‌.పోశెట్టి, సుజిత్‌సింగ్‌ ఠాగూర్‌, విఠల్‌రావు, సుదం సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.