అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం
శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఎఫ్‌డిఐలను ఆహ్వానించేందుకే యూపిఏ బహిరంగ సభ నిర్వహిస్తుందని ధ్వజమెత్తారు. దీని ద్వారా బలప్రదర్శనకు ప్రయత్నిస్తుందని అన్నారు. రిలయన్స్‌ వ్యవహారంలో మంత్రులను మార్చడం కాదు…. విధానాలనే మార్చాలని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన టిడిపి నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనకు నివాళులర్పించారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రన్నాయుడు మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. ఎర్రన్న నిరాడంబరుడు, నిగర్వి అని కొనియాడారు. ఆయన మరణంతో వామపక్ష మిత్రుడిని కోల్పోయినట్టు భావిస్తున్నానని చెప్పారు. సిపిఐ జాతీయ సమితి తరఫున ఆయన ఎర్రన్నకు జోహారులు అర్పించారు.