అవినీతి నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలి

గుంటూరు, జూలై 19 : ప్రజల ఆస్తులను కొల్లగొట్టే నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గురువారం డాక్టర్‌ ఆదినారాయణ వర్ధంతి సందర్భంగా కారంపుడిలోని ఆయన స్థూపం వద్ద జరిగిన సంతాప సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆయన కుమారుడు జగన్‌ లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల సొమ్మును స్వాహా చేశారని, అటువంటి పార్టీ అభ్యర్థులకు సానుభూతిలో ఓట్లు వేస్తే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. దోపిడీ వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఎదదుర్కొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, బిజెపి మంత్రిగా చేసిన గాలిజనార్ధనరెడ్డి ఒబుళాపురం మైన్స్‌ ద్వారా అక్రమంగా 35 వేలకోట్లు అవినీతిలో సంపాదించారన్నారు. 2014 ఎన్నికలకు సిపిఐ తదితర పార్టీలు కలసి శక్తివంతమైన మూడవ కూటమిని ఏర్పరచటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యయన్నారు. బిజెపి, కాంగ్రేస్‌ పార్టీలకు అతీతంగా మూడో ఫ్రంట్‌ ఆవిర్భవిస్తొందన్నారు. సమావేశంలో మాచర్ల ఏరియా సిపిఐ కార్యదర్శి తద్వారా బాలస్వామి రెడ్డి, హుస్సేన్‌, నర్మిశెట్టి గురవయ్య, వసంతరావు, సత్యనారాయణ, లెనిన్‌, విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు.