అసోంపై విష ప్రచారం ఆపాలి విషయాల లోతుకెళ్లాలి..

పచ్చని పల్లెల్లో ఓ వార్త చిచ్చును రేపుతుంది. సహజంగానో అసహజంగానో జరిగే మరణాలకు ఓ వ్యక్తే కారణమంటూ ప్రచారం జరుగుతుంది. అంత వరకూ ప్రశాంతంగా ఒక్క సారిగా ఉలిక్కిపడ్తుంది.  ఇక అది మొదలు గ్రామంలో ఎవరు చనిపోయినా, ఆఖరికి  ఊర్లో పశువులు పాలివ్వకపోయినా ఆవ్యక్తే కారణమంటారు. చెట్టు చచ్చినా, మొక్క మొలవకపోయినా ఆ వ్యక్తి వంకే అనుమానంగా చూస్తారు.  వాడికి మంత్రాలొచ్చంటూ ఊరంతా అతడిని దయ్యాన్ని చూసినట్లు భయపడుతూ చూస్తారు. చివరికి ఆ భయం ముదిరి వాడిని మంత్రాల నెపంతో హతమారుస్తారు. కసితీరా కొడుతూ అతన్ని చంపేస్తారు.

అసోంలో నేడు జరుగుతందదే. 1980 నుండి బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు లక్షల్లో ఉన్నారంటూ బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరెస్సెస్‌  , బీజెపీ చొరబాటుదారుల సంఖ్యపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. శంకర్‌దేవ్‌, అజన్‌ఫకీర్‌ వంటి కవి, సాధువుల కృషి ఫలితంగా దశాబ్దాలుగా అసోంలో హిందూ ముస్లింల సమైక్యత వెల్లివిరుస్తోంది. హిందూ ముస్లిం సామరస్యం అక్కడ కనబడుతుంది. వీరి కృషి ఫలితంగా హైద్రాబాద్‌ లాగే అసోం హిందూ ముస్లిం సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఇపుడు కొన్ని తపుకార్లు షికార్లు చేస్తూ అసత్య ప్రచారంతో అసోంలో మత ఘర్షలకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.  విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వార్తా పత్రికలు సైతం అక్కడి వార్తా విషేషాలను కవర్‌చేస్తున్నాయే తప్ప లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నించట్లేదు. సరిహద్దుల నుండి వేలకు వేలు చొరబాటుదారులు సులువుగా దేశంలోకి రాగలుగుతున్నారన్న అసత్యపు ప్రచారంతో అసోంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. జూలై 6 నుండి దాదాపు నేటి వరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 60 మంది చనిపోయారు. లక్షల మంది శరణార్థులు వేర్వేరు శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 27 శిబిరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు లక్షల మంది తలదాచుకొంటున్నారు. 1980 వ దశకంలో అసోం విద్యార్థి ఉద్యమం జరిగింది.  ఆ తర్వాత నెల్లి ఊచకోత జరిగింది.  నెల్లిలో బెంగాలి మాట్లాడే ముస్లింలు, లాలంగ్‌ తెగల ప్రజల మధ్య ఘర్షణలు జరిగాయి. దీనిలో దాదాపు 3వేల మంది చనిపోయారు.  దీనివల్ల అస్సామి మాట్లాడే ముస్లింలు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 2008లో మరోసారి ముస్లిం, బోడో తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో 55 మంది ముస్లింలు హతమయ్యారు.  విషయం వివరాల్లోకి వెళితే అసలు నెల్లి తెగ ముస్లింలు బ్రిటిష& పాలనలో బంగ్లాదేశీయలుగా పిలవబడుతున్న  ఈ తెగ ముస్లింలు దేశంలో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో బ్రిటిష్‌ పాలకులు వ్యవసాయాన్ని విస్తరింపచేయడానికి కొన్ని తెగలను తీసుకువచ్చినట్లే బెంగాలీ మాట్లాడే ముస్లింలను కూడా తీసుకువచ్చారు.  అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉన్నా వారంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారేనన్న ప్రచారం అబద్దం. బెంగాల్‌ నుంచి వచ్చిన వారు, బెంగాలి మాట్లాడే ముస్లింల నందరిని బంగాదేశీయులుగా జతకడుతూ విస్తృతంగా అసత్యపు వక్రీకరణ జరుగుతుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి హింది మాట్లాడే బీహారీలు, రాజస్థానీలు వచ్చిన వారి లాగే అసోంలో కూడా జరిగింది. ప్రతి సమస్యకు బెంగాలి మాట్లాడే ముస్లింలే కారణమన్న ఒక ఫోబియోతో కూడిన విస్తృతమైన అసత్యపు ప్రచారం అక్కడ జరుగుతుంది. అదే అక్కడ మత ఘర్షలకు కారణమవుతుంది.   దేశ వ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వలసలు వచ్చారు. 2003 లో కేంద్ర ప్రభుత్వం బోడో ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసింది. ఇది కూడా ఘర్షణలకు కారణమవుతోంది. అప్పట్లో బోడో ల్యాండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను చేసినపుడు వారిని సంతృప్తి పరచడానికి బోడో ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసింది. అయితే బోడోయేతర ప్రజలు బిటిసి పట్ల అసంతృప్తితో ఉన్నారు. పాలనకు సంబంధించి అన్ని అంశాలపై దానికి అన్ని పూర్తి అధికారాలు ఇవ్వడం, ఆవేశాలకు, ఆగ్రహాలకు కారణమవుతోంది. బోడోలు ఇతర జిల్లాల్లోనూ తమ ఆధిపత్యాన్ని జనాభాను పెంచుకొంటూ బిటిసి అక్కడ కూడా వర్తింప చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బోడో సాయుధ పోరాటం జరిపినపుడు ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగిపోయామని చెప్పినా ఇప్పటికి సాయుధంగా తిరగడం, అక్కడి మిలిటెంట్ల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండడం అసహజమేమీ కాదక్కడ.  ఇప్పటి వరకు అల్లర్లపై జరుగుతున్న అసత్యపు ప్రచారాలు కాకుండా ప్రభుత్వం అధికారికంగా వాస్తవాలు చెప్పాలి. అలాగే అక్కడి ప్రజల మధ్య మతసామరస్యం విలసిల్లే చర్యలు చేపట్టాలి. ఈశాన్య రాష్రాల ప్రజలు నివశిస్తున్న ఇతర ప్రాంతాల్లో అల్లర్లు జరగకుండా ముస్లింలు కానీ మరెవరిపై కానీ దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇదే అదనుగా ముంబైలో బాల్‌ థాక్రే, మహారాష్ట్ర నిర్మాణ సేన వంటి సంస్థలకు ఆయుధాలివ్వరాదు. దేశ ప్రజలు సోదరులు అన్న ప్రచారాన్ని చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి.  అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ పరిష్కారం కనుగొనాలి. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే సంస్థలను తక్షణం నిషేధించాలి. అదేవిధంగా మయన్మార్‌లో రెహింగ్యా తెగ ముస్లిం తెగపై జరుగుతున్న దాడులు, ముస్లింల ఊచకోతపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆదేశాన్ని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన దాడులు జరగడం బాధాకరం. వీటిని కొత్త ప్రాంతాలకు విస్తరించి పబ్బం గడుపుకోవాలనే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భారతీయులందరూ ఒకటేనన్న విషయం ప్రజలు గమనించి ఇలా రెచ్చగొట్టే శక్తులను తరిమికొట్టాలి.