ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన హైదరాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైన మార్చ్‌ కొనసాగుతుందని, ఈ కవాతుకు అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ను 17ను అధికారికంగా నిర్వహించాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మాత్రం ఈ రోజును తెలంగాణ ప్రజలు అధికారికంగా జరుపుకుంటారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు ఉన్నంత కాలం, తెలంగాణ బాగు పడదని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందని వివరించారు. దీనికి కిరణ్‌ సర్కారు కూడా మినహాయింపు కాదని, సోమవారం తెలంగాణ విలీన దినోత్సవంపై సీఎం చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, తెలంగాణ మార్చ్‌తో ఉద్యమ సత్తా ఢిల్లీ పెద్దలకు తప్పక తెలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయం ఆసన్నమైందని, ఇక సంబురాలు చేసుకోవడమే తరువాయి అని ఆయన స్పష్టం చేశారు. మార్చ్‌ విజయవంతానికి ఇంటికో ఇద్దరు, చేతికో జెండాతో తరలిరావాలని కోదండరాం పునరుద్ఘాటించారు.