అమెరికా లేకపోతే ఐరోపాకు రక్షణే లేదు

` నాటో చీఫ్ హెచ్చరికలు
న్యూయార్క్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్ వ్యవహారంలో ఐరోపా కూటమి, అమెరికాల మధ్య విభేదాలు తలెత్తిన వేళ.. నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం మద్దతు లేకపోతే యూరప్‌కు రక్షణే లేదని హెచ్చరించారు. బెల్జియంలో ఈయూ చట్టసభ్యులతో జరిగిన సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఈ విషయం గురించి ప్రస్తావించారు.“అమెరికా సాయం లేకుండానే యూరోపియన్ యూనియన్ లేదా ఐరోపా తనను తాను రక్షించుకోగలదని ఎవరైనా అనుకుంటే.. అలాగే భ్రమపడుతూ ఉండండి. ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఐరోపాకు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యం లేదు. ఒకవేళ ఈ విషయంలో సొంతంగా నిలబడాలనుకుంటే.. ఐరోపా దేశాలు రక్షణపై వ్యయాలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ఐరోపా, అమెరికా పరస్పరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది” అని మార్క్ రుట్టే వెల్లడించారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ హెచ్చరికలతో అమెరికా, ఐరోపా దేశాల మధ్య బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. గ్రీన్‌లాండ్‌కు మద్దతిస్తున్న ఐరోపా దేశాలపై సుంకాలను విధిస్తానని ట్రంప్ బెదిరింపులు కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాటో చీఫ్ మార్క్ రుట్టే.. అగ్రరాజ్య అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి వీరు ఓ ఫ్రేమ్‌వర్క్ రూపొందించారు. దీంతో సుంకాలపై తన నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.



