ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు
అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి. గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు నిర్వహించిన అష్టావధానం అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఎస్‌. లక్ష్మీపార్వతి, శారదా శోంఠి, ఓలేటి నరసింహారావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, డొక్కా ఫణికుమార్‌, తదితరులు పాల్గొని అవధానాన్ని రక్తి కట్టించారు. ముగింపు వేడుకల్లో ప్రముఖ కధానాయక ఇలియానా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అర్థరాత్రి వరకు జరిగిన సంగీత విభావరికి మంచి స్పందన కనిపించింది. జానపద, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఘుమఘుమలాడింది. శోఖానాయుడిని ఆమె శిష్యులు సత్కరించారు. ఇప్పటివరకు వివిధ సేవా కార్యాక్రమాలకు రూ. 25 కోట్ల విరాళంగా ఇచ్చిన ప్రవాసాంధ్ర వైద్యుడు లకిరెడ్డి హనిమిరెడ్డిని ఆటా బృందం ప్రత్యేక పురస్కారంతో సత్కరించింది. ఆటాకు విచ్చేసిన రాష్ట్ర ప్రతినిధులతో ఓ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు జిన్నా రాజేందర్‌, సభల సమన్వయకర్త ఆసిరెడ్డి కరుణాకర్‌, కార్యదర్శి కొండా రామ్మోహన్‌లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.