ఆటోడ్రైవర్లపై లాఠీచార్జి

విశాఖపట్నం,జూలై 10:ఆర్టీఎ అధికారుల దాడులకు నిరసనగా ఆటోడ్రైవర్లు మంగళవారంనాడు ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆర్టీఎ అధికారులదాడులకు నిరసనగా ఎక్కడి ఆటోలను అక్కడే ఆపేసి ఆటోడ్రైవర్లు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆటో డ్రైవర్లకు నచ్చజెప్పేందుకు యత్నించారు. అంతేగాక ధర్నాను విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఆటోడ్రైవర్లపై లాఠీచార్జి చేశారు. అంతేగాక 15మందిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటోలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.