ఆర్టీసీలో సమ్మె సైరన్‌ 14లోపు పరిష్కరించండి..

లేదంటే సమ్మెఖాయం: ఎన్‌ఎబయూ
హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి):
ఆర్టీసీ గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘం ఎన్‌ఎంయు మరోసారి సమ్మెకు సమాయత్తమైంది. అంతేగాక శుక్రవారం ఉదయం ఎన్‌ఎంయు నేతలు ఆర్టీసి పరిపాలన కార్య నిర్వాహక అధికారి ఎవి రావుకు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వెలుపలకు విచ్చేసిన ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. జులై 14లోగా డిమాండు పరిష్కరించకపోతే ఆ రోజు నుంచే ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఇప్పటికే అనేక వినతిపత్రాలు అందజేశామన్నారు. నేటికీ ప్రయోజనం చేకూరకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. వేతన సంఘాన్ని నియమించాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల సంతానంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తదితర డిమాండ్లు ఉన్నాయన్నారు. వాటన్నింటిని పరిష్కరించాలని కోరారు. లేకుంటే సమ్మె తథ్యమని చెప్పారు.