జీవో తప్ప జీవితం మారలే

 

 

 

 

 

డిసెంబర్ 6(జనం సాక్షి) :హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది. హోంగార్డు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణమైనా అత డి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్‌ హయాంలో రోజువారీ ఇచ్చి న రూ.921 వేతనానికి మరో రూ.79 కలుపుతూ రూ.వెయ్యి చేసింది. వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ను 100 నుంచి రూ.200కు పెంచుతున్నట్టుగా జీవో2లో పేర్కొంది తప్ప ఇప్పటి వరకు పట్టించుకున్నది మాత్రం లేదు.

ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు..
జనవరి 2న ఇచ్చిన జీవో 2లో చనిపోయిన హోంగార్డులకు రూ.5 లక్షలు ఇస్తామన్నది వట్టిమాటలుగా మా రాయని బాధితులు వాపోతున్నారు. ఏడాది కాలంలో 60 మంది హోంగార్డులు చనిపోయి ఉంటారని, అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తప్ప సహజ మరణం పొందిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వలేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. డాక్యుమెంట్లన్నీ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదంటున్నారు. చనిపోయిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు లేకపోవ డం, ఇస్తామన్న డబ్బులు సకాలంలో అందించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు.

కలగానే నియామకాలు..
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ పెద్దలు తమకు ఆశలు కల్పించారని హోంగార్డు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని, కారుణ్య నియామకాలు ఇస్తామని, హెల్త్‌కార్డులు, వీక్లీ ఆఫ్‌లు ఇప్పిస్తామని హామీలు అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాలు ఇవ్వొద్దంటూ సర్క్యూలర్‌ జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల పర్మినెంట్‌, హెల్త్‌కార్డుల ఊసేలేదని, సెలవుల గురించి పట్టించుకునేవారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఆర్డర్లీ వ్యవస్థ రద్దు, ఇతర అలవెన్స్‌లు గాలిమాటలుగానే మిగిలిపోయాయంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు అన్నీ కలగానే మారాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కేవలం హోంగార్డుల వినతులు, మీడియా ఒత్తిడికి తలొగ్గి మాత్రమే హోంగార్డుల రైజింగ్‌ డే మాత్రమే నిర్వహిస్తున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.

8 ఏండ్లలో రూ.17వేలు పెంచిన సీఎం కేసీఆర్‌
ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు హోంగార్డుల వేతనం 9వేలే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014 డిసెంబర్‌ 5న హోంగార్డుల జీతాన్ని రూ.12 వేలకు పెంచి అందరినీ ప్రగతి భవన్‌కు పిలిపించుకొని భోజనాలు పెట్టించి 2015 ఏప్రిల్‌ నుంచి పెంచిన జీతాలను అమలు చేశారు. అంతేకాక నెలకు రెండుసార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ.28ని కూడా రూ.100కు పెంచారు. డిసెంబర్‌ 13, 2017లో జీతాలను రూ.21 వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతో రూ.27,630 కు చేరాయి. ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా అలెవెన్సు ప్రకటించడంతో పట్టణాలు, నగరాల్లో హోంగార్డుల వేతనాలు రూ.30 వేల నుంచి రూ.35 వేలకు పెరిగాయి.

కరోనా ముందు వరకు యూనిఫాం అలవెన్సు కింద ఏటా రూ.7,500, మహిళా హోంగార్డులకు ఆరు నెలల మెటర్నరీ సెలవులూ ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే 5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచింది. మొత్తంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేయడంతో వారి కుటుంబాలు గౌరవంగా బతికాయి. కాంగ్రెస్‌ సర్కార్‌ కేవలం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన రోజువారీ వేతనం రూ.921కి మరో 79 కలిపి మొత్తం రూ.వెయ్యి చేసి ఎంతో చేసినట్టుగా గప్పాలకు పోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.