సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం
` డికే శివకుమార్ స్పష్టీకరణ
` సీఎం మార్పుపై ప్రచారానికి తెర
బెంగుళూరు (జనంసాక్షి): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి ఎట్టకేలకు తెరపడిరది. ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని వెల్లడిరచారు. ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ‘‘మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే. గ్రూప్‌లు కట్టడం నా రక్తంలోనే లేదు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మంత్రి కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే దిల్లీలోని హైకమాండ్‌తో వారు సమావేశం అవడం సాధారణమే. అది వారు హక్కు కూడా..! అధిష్ఠానం వద్దకు వెళ్లొద్దని మేం వారిని ఆపలేం కదా..! ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం చెప్పారు. ఆయనకు మేమంతా అభినందనలు తెలియజేస్త్తున్నాం.ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం అయినా.. నేనైనా పదే పదే చెప్పేది ఒక్కటే.. హైకమాండ్ ఆదేశాలకు మేం కట్టుబడి ఉంటాం’’ అని డీకే శివకుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు.2023లో జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. గురువారంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారుకు రెండున్నరేళ్లు నిండాయి. దీంతో రాజకీయం వేడెక్కింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా దిల్లీకి వెళ్లడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. సీఎంగా శివకుమార్‌ను పగ్గాలు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు హైకమాండ్‌ను అభ్యర్థించినట్లు కూడా వార్తలు వచ్చాయి.అయితే, అధికార పంపిణీ అంశాన్ని మొదటి నుంచీ తోసిపుచ్చుతున్న సిద్ధరామయ్య.. ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతు తనకే ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా సమావేశమై మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. క్యాబినెట్‌లో మార్పులు చేస్తే అసంతృప్తులను బుజ్జగించొచ్చని సీఎం భావించారు. ఇందుకు హైకమాండ్ నుంచి కూడా అంగీకారం లభించినట్లు సమాచారం.


