ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు

రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు, మహిళలు, యువకులు, 12 గ్రామాల రైతులు సాధించిన విజయమని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు అంబేడ్కర్‌, జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కంపెనీ యాజమాన్యం పెద్ద ధన్వాడ నుండి పక్క రాష్ట్రానికి తరలిపోయిందనే విషయాన్ని తెలుసుకుని ఆయా గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు. మహనీయుల స్ఫూర్తితో కంపెనీ రద్దు అయ్యేదాకా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు వచ్చే ఏ ప్రాజెక్టునైనా ఇలాగే తరిమికొట్టేదాకా పోరాడాలని నినదించారు.