పెద్ద ధన్వాడకు ఇథనాల్ ‘పీడ’పోయినట్టే..!?
తోకముడిచిన గాయత్రీ రెన్యూవబుల్ లిమిటెడ్ యాజమాన్యం
నెల్లూరు జిల్లాకు తరలిపోయిన కాలుష్య కంపెనీ
ప్రజల ఐక్య పోరాటంతో సాధ్యమైన విజయమిది..
మొదట్నుంచీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నడుంబిగించిన పెద్దధన్వాడ ఆబాల గోపాలం
నేడు సంబరాలు జరుపుకోనున్న గ్రామస్తులు
ఇంకా రద్దుకాని పరిశ్రమ లైసెన్సు
మరో ఐదేళ్ల పాటు పొంచిఉన్న ప్రమాదం
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) :
అనుకున్నదే అయ్యింది..! ప్రాణం పోయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటామని భీష్మించిన ప్రజలు గెలిచారు. కలిసికట్టుగా ఉద్యమించిన వారి పంథా నిలిచింది. కాలుష్య భూతంపై కన్నెర్రజేసిన చిన్నాపెద్దా తుదికంటా తమ ఊరి కోసం పోరాడిన దరిమిలా ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎట్టకేలకు తోకముడిచింది. రైతులు, గ్రామస్తులపై ఎన్ని కేసులు పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోవడంతో చివరకు తట్టాబుట్టా సర్దుకోక తప్పలేదు. పండుగా పబ్బాలను కూడా లెక్కచేయకుండా ఒక్కతాటిపై నిలిచిన పెద్దధన్వాడ.. విషపూరిత ఇథనాల్ ఫ్యాక్టరీని తరిమికొట్టింది. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, పల్లెలకు పోరాట దిక్సూచినని ఘనంగా చాటింది.
పది నెలల పాటు ప్రజలంతా ఐక్యంగా పోరాడటంతో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో వెనక్కి వెళ్లక తప్పలేదు. ప్రస్తుతం ఆ కంపెనీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ ప్రకటనలో ప్లాట్ నంబర్లు 564-1ఏ, 564-1బి, 564-1డి, 564-1ఈ, ఇఫ్కో కిసాన్ సెజ్, రాచర్లపాడు గ్రామం, రేగడిచెలిక గ్రామ పంచాయతీ, కోడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 30న మధ్యాహ్నం 1 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లనున్నట్టు తెలిసింది. 200 కిలోలీటర్లు ప్రతిరోజు (200కేఎల్ పీడీ) సామర్థ్యంతో ధాన్యాల ఆధారిత ఎథనాల్ ప్లాంట్ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేయనున్నట్టు సదరు ప్రకటనలో వెల్లడైంది. ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాక్టరీ తరలిపోయినట్టుగానే పలువురు భావిస్తున్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ అనేది వ్యవసాయ, ఆహార పరిశ్రమలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం. కృష్ణపట్నం ఓడరేవు, ఎన్ హెచ్-16 సమీపంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం బాగుంటుందని ఫ్యాక్టరీ యాజమాన్యం అటుగా వెళ్లిపోయినట్టుగా సమాచారం. పైగా పెద్దధన్వాడలో ఫ్యాక్టరీ పనులు ఇసుమంతైనా ముందుకు సాగకపోవడంతో యాజమాన్యం విరమించుకోక తప్పలేదు.
అస్సలు తగ్గని ప్రజలు
గతేడాది అక్టోబర్ నెల నుంచి మొదలైన ప్రజల ఉద్యమం ఈయేడు జూన్ వరకు వివిధ రూపాల్లో కొనసాగింది. జూన్ 4న ప్రజాగ్రహం పెల్లుబుకడం, ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేటు సైన్యంతో గ్రామస్తులపై దాడికి దిగడం, ప్రతిగా రైతులు సామాగ్రిని ధ్వంసం చేసి తగలబెట్టడం, ఆపై కేసులెదుర్కొని జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అంతకుముందు వాల్ పోస్టర్లు, వినూత్నమైన పద్ధతుల్లో తమ నిరసనలు తెలిపారు. ఊరూరా ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావాలపై చదువుకున్న యువకులు విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్కల పల్లెలను సైతం చైతన్యపరిచారు. ఒక్క గ్రామంలో మొదలైన ఉద్యమం క్రమంగా 14 పల్లెలను తాకడంతో నిత్యం వందలాది మంది నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీశారు. పలు సందర్భాల్లో అధికారులనూ అడ్డుకున్నారు. ఈ మొత్తం ఉద్యమంలో ఎక్కడా చిన్న ఏమరపాటకు తావివ్వలేదు. చిన్న చప్పుడైనా ప్రజలు పెద్దగా స్పందించారు. పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సైతం తమ గోడును వినిపించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రజలను, రైతులను మభ్యపెట్టినా కూడా పోరాటంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు ప్రజలందరితో కలిసికట్టుగా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. జైలు పాలైనవారికి మద్దతుగా ఊరిలో పండుగలు కూడా నిర్వహించలేదంటే పెద్దధన్వాడ పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ కుట్రలను తిప్పికొట్టి..
పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతం తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల పెట్టుబడి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలనుకున్నారు. కానీ పరిశ్రమ గురించి పూర్తిగా వివరించకుండా, సూచనలు చేయకుండా గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పలుమార్లు పనులకు పూనుకుంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా, నాయకులకు తెలియజేసినా తమ మొర పట్టించుకోవడం లేదని ప్రజాగ్రహం పెల్లుబికింది. జిల్లా అధికారులు సైతం వివిధ సందర్భాల్లో రైతులను సముదాయించినా.. ప్రజల పట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం కవ్వింపు చర్యలను మాత్రం పట్టించుకోలేదు. అనుమతులు, వాటి పత్రాలు చూపాలని ఆదేశించినా ఆ ప్రక్రియ జరగలేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరగనే లేదు. దీంతో పెద్దధన్వాడలోని కొందరు ఐక్యమై ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ బతకడమే కష్టమైపోతుందని, పంటలు సహా మూగజీవాలన్నీ నాశమవుతాయని ఆందోళనబాట పట్టారు. విద్యార్థి యువజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సైతం వారికి మద్దతు తెలిపాయి. అయినప్పటికీ ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి రాజకీయ రంగు పులుముకోకుండా పోరాట కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పక్కా వ్యూహంతో ముందుకు కదిలారు. చివరిదాకా పోరాడి ఫ్యాక్టరీని తరిమికొట్టారు.
‘జనంసాక్షి’ కీలక భూమిక
కాలుష్య పరిశ్రమ ఏదో రాబోతుందని పసిగట్టిన ‘జనంసాక్షి’ 2024 అక్టోబర్ నెలలో ‘పచ్చని పల్లెలపై ఇథనాల్ విషం’ శీర్షికన ఓ సంచలన కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తమై ఇథనాల్ వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని చైతన్యవంతమయ్యారు. అక్కడినుంచి ఫ్యాక్టరీ పనులను ఏ కోశానా ముందుకు వెళ్లనివ్వలేదు. ప్రతినిత్యం ‘జనంసాక్షి’ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పతాక శీర్షికన వార్తలు ప్రచురించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం కదలికలను, ఈ విషయంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు కుండబద్దలు కొట్టింది. ప్రజల ఉద్యమానికి ఊతంగా, పల్లెలకు ప్రచారవాహిణిగా కథనాలను వెలువరించింది. రాష్ట్రంలో కాలుష్య పరిశ్రమలు రాబోతున్న ప్రాంతాలను సైతం అప్రమత్తమయ్యేలా ఎప్పటికప్పుడు తన గొంతు వినిపించింది. అందుకే ‘మమ్మల్ని జనంసాక్షియే ప్రజలను ముందుండి నడిపించింది’ అని ఆయా గ్రామాల ప్రజలు చెబుతుండటం ‘జనంసాక్షి’కీ ఓ గర్వకారణం..!



