ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం
దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం
రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి

ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోంది. ఇది మరింతగా అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో పోల్చితే 79 దాటేసి.. 80కి చేరువలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 80కి చేరువలో దిగజారింది. ఇది ఆల్‌టైం రికార్డ్‌ కనిష్టం. డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్టస్థాయికి పడిపోయి 80 వైపు చూస్తున్నది. కరెన్సీ పతనంతో పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలు, పప్పులు తదితరాల ధరలన్నీ ఆకాశాన్ని తాకాయి. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు ఈ ఏడాది ఇప్పటివరకూ రిజర్వ్‌ బ్యాంక్‌ 40 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఉపయోగం లేకుండాపోయింది. 2014కు ముందు బిజెపి అధికారంలోకి రాకముందు.. డాలర్‌తో రూపాయి విలువ 68కి పడిపోతే నరేంద్ర మోడీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఐసియులో పడిపోయిందని.. తాము అధికారంలోకి వస్తే దేశీయ కరెన్సీని ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకునేలా చేస్తామని అనేక గొప్పలు చెప్పారు. ప్రస్తుతం అంతకంటే దారుణమైన స్థితిలోకి రూపాయి పడిపోతున్నప్పటికీ.. కట్టడి చర్యలు కానరావడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. దేశీయ గణంకాలు బలహీనంగా చోటు చేసుకోవడానికి తోడు అంతర్జాతీయం
గా డాలర్‌ విలువ పెరగడం రూపాయిని ఒత్తిడికి గురి చేసిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది జూన్‌లో భారత ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా చోటు చేసుకోవడం.. రికార్డ్‌ స్థాయిలో వాణిజ్య లోటు 25.63 బిలియన్‌ డాలర్లకు ఎగిసిపడటంతో రూపాయిపై మరింత ఒత్తిడి చోటు చేసుకుంది. వచ్చే రెండు, మూడు సెషన్లలో డాలర్‌తో రూపాయి విలువ 78.50`80 మధ్య కదలాడొచ్చని పేర్కొన్నారు. భారత్‌లోనూ మందగమన భయాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోవడం, ఆర్‌బిఐ వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు రూపాయిని కుదేలు చేస్తున్నాయి. రూపాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో దిగుమతి ఆధారిత అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. చమురు ధరలు ఎగిసిపడనున్నాయి. అధిక ధరలతో ఇప్పటికే ప్రజలు తీవ్ర బెంబేలెత్తుతున్నారు. విదేశీ అప్పులు తీవ్ర భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరింత పన్నుల భారాన్ని మోపనుంది. ద్రవ్యోల్బణం ఎగిసిపడనుంది. వృద్థి రేటుపై ప్రతికూల ప్రభావం పడనుంది.