ఇంటింటా చెట్టు .. అదే ఆరోగ్యానికి రక్ష
శ్రీకాకుళం, జూలై 31: ఆరోగ్యవంతమైన ప్రజా జీవనానికి పచ్చని మొక్కల పెంపకం అవసరమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 63వ వనమహోత్సవం సందర్భంగా స్థాణిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెట్టు మనిషికి ప్రాణవాయువును అందించి ఆరోగ్యపరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ ఏడాది మన జిల్లాలో రెండు లక్షల చెట్టను నాటడానికి అటవీ శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. సొంతంగా పెంచిన చెట్టు వారి అవసరాలకు నరకాలంటే దానికి ప్రత్యామ్నాయంగా వేరే మొక్క నాటితే తప్పా నరకడానికి పర్మిషన్ ఇవ్వరని తెలిపారు. వన్యప్రాణుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై వ్యాసరచన, ఇంటింటా చెట్టూ ఊరంతా చెట్లు నాటితే క్షేమం- చెట్టు నరికితే క్షామంపై పెయింటింగ్ డ్రాయింగ్ పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి బహుమతులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. శాసనమండలి సభ్యులు పి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ చెట్టను పెంచడం వల ప్రజా జీవితంలో కాలుష్యాన్ని నివారిస్తుందని, అంతరించిన పక్షిజాతి రక్షణకు చెట్టు అవరసమన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ 63వ వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ఈ రోజు రాష్ట్రమంతటా 20లక్షల చెట్లు నాటడం జరగుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అంటా పర్యటించారని, ఆయన పర్యటించిన ప్రాంతంలో ఉన్న చెట్లను చూసి ఇంత పచ్చని చెట్లు కలిగిన ప్రాంతం ఏ జిల్లాలో కూడా లేదని జిల్లాను అభినందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.సి.యం.ఎస్ చైర్మన్ జి.క్రిష్ణమూర్తి, విశాఖపట్నం ఫారెస్టు కన్జర్వేటర్ కె. సత్యనారాయణ, డి.ఎఫ్.ఓ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.