ఇవేం రోడ్లు?

C

– అధికారుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): హైదరాబాద్‌ రోడ్ల పరిస్థితి ఏ మాత్రం సంతృప్తిగాలేదని, అందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే తన విధుల్లో బిజీబిజీ అయ్యారు. ఈమేరకు ఇవాళ ఆయన నగరంలోని పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీనగర్‌ కాలనీ, షాపూర్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు అధికారులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సవిూక్ష నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా శ్రీనగర్‌ కాలనీలో రోడ్ల దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేయాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రోడ్ల పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఆరు మాసాలుగా నత్తనడకన రోడ్డు పనులు సాగుతున్నాయని మంత్రికి స్థానికులు విన్నవించుకున్నారు. మంత్రి వెంట మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, స్థానిక కార్పొరేటర్‌ కవిత ఉన్నారు. అలాగే స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను తొలగించాలని ఆయన సూచించారు.  నగర అభివృద్ధికి రూపొందించిన వంద రోజుల ప్రణాళిక పనుల పురోగతిని ఆయన పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా అవిూర్‌పేటలోని శ్రీనగర్‌ కాలనీలో పర్యటించారు. కాలనీలో విద్యుత్‌ కేబుళ్ల కోసం రహదారి మధ్యలో తవ్విన గోతులను మంత్రి పరిశీలించారు. గోతులను తవ్వి చాలాకాలంగా అలాగే వదిలేశారని… వీటివల్ల ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై కాంట్రాక్టర్‌నుపిలిచి మాట్లాడాలని, తవ్వి వదిలేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. తాను నగరంలో పలుచోట్లతిరిగి రోడ్లను పరిశీలించానని తెలిపారు. తమ పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. నగర రోడ్లను ప్రపంచస్థాయిలో తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం కలిసి పనిచేయాలని తెలిపారు. హైదరాబాద్‌లో గుంతలులేని రోడ్లు, ఎగుడు దిగుడు మ్యాన్‌¬ల్స్‌ లేని రోడ్లు రావాలని ఆకాంక్షించారు. అధికారుల పనితీరు మెరుగుపడలన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మూస పద్ధతులు మానుకోవాలని సూచించారు. మూస పద్దతులంటే ఇవాళ రోడ్లు వేయడం, రేపు వర్షం రాగానే రోడ్లు గుంతలు పడటం వాటిని తిరిగి పునరుద్దరించడం వంటివని వివరించారు. ఈ పరిస్థితి మారాలంటే అధికారుల ఆలోచనలో సమూల మార్పులు రావాలని అన్నారు. శాఖల మధ్య సవన్వయం కోసం కృషి చేస్తున్నామన్నారు. అధికారుల మధ్య సమన్వయం కోసం ఈనెల 16న అన్ని శాఖల ముఖ్య విభాగాధిపతులతో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సర్కిళ్లవారీగా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని 24 సర్కిళ్లు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సవన్వయం ఉంటే ప్రజలకు ఇబ్బందులుండవన్నారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. నగర సమస్యలపై తమకు రోజూ ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా నిర్మాణ సామాగ్రి పడి ఉందన్నారు. ప్రతీరోజు 5 వందల టన్నుల మట్టి వ్యర్థాలు పడుతున్నాయని వివరించారు. దీని నిర్వహణలో ఢిల్లీ వంటి నగరాలు అనుసరిస్తోన్న విధానాలను అనుసరించాలన్నారు. నగర ప్రజల శ్రేయస్సు కోసం సమూలమైన మార్పులు తేవాలన్నారు. హైదరాబాద్‌ నగర రోడ్ల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు. కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తదితరులు సవిూక్షలో పాల్గొన్నారు.

5రూపాయల భోజం బాగుందన్న కెటిఆర్‌

రోడ్ల తనిఖీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న రూ.5 భోజనం కౌంటర్‌ను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. క్యాంటిన్‌లో భోజనం కూడా చేశారు. మంత్రితో పాటు ఎంపీ మల్లారెడ్డి, మేయర్‌ రామ్మోహన్‌, ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ భోజనం చేశారు. దీని నిర్వహణ బాగుందని కితాబునిచ్చారు. ఇది పేద మధ్య తరగతి ప్రజలకుఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.