గ్రీన్‌ల్యాండ్‌ స్వాధీనానికి ట్రంప్‌ ఎత్తుగడలు

` లాటిన్‌ అమెరికా దేశాల్లో గందరగోళం
` వెనిజువెలాపై దాడి చమురు కోసమేనని ప్రచారం
` గ్రీన్‌లాండ్‌ అమెరికాలో భాగంగా మారాల్సిందే
` అది మా జాతీయ భద్రతకు అవసరం
` ఆ దేశంపై నియంత్రణకు మా వద్ద అనే ఆప్షన్‌లు ఉన్నాయి
` వాటిలో సైనిక చర్యను పరిశీలిస్తున్నాం
` వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్భంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ఎంపికలపై అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన బృందం చర్చిస్తోందని వైట్‌హౌస్‌ మంగళవారం ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించేందుకు ’మిలటరీ’ని ప్రయోగించడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థులను అడ్డుకునేందుకు గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతా ప్రాధాన్యతగా ట్రంప్‌ భావిస్తున్నారని జాతీయ విూడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే మార్గాల గురించి ఓవల్‌ కార్యాలయంలో చర్చలు కొనసాగుతున్నాయని మరియు సలహాదారులు వివిధ మార్గాలపై చర్చిస్తున్నారని అమెరికా సీనియర్‌ అధికారి తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా నాటో నేతలు చేసిన ప్రకటనలపై ట్రంప్‌ భయపడటం లేదని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కోనుగోలు చేయడం లేదా ఆ భూభాగంతో స్వేచ్ఛా అనుబంధ ఒప్పందం (సిఒఎఫ్‌ఎ) ఏర్పరుచుకోవడం కూడా ఉందని పేరు వెల్లడిరచేందుకు నిరాకరించిన ఒక అధికారి తెలిపారు. సిఒఎఫ్‌ఐ ఒప్పందం గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో భాగం చేయాలనే ట్రంప్‌ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని అన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అనంతరం గ్రీన్‌ల్యాండ్‌పై సుమారు రెండు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తానని ట్రంప్‌ ఆదివారం వెల్లడిరచిన సంగతి తెలిసిందే.వెనిజువెలాపై దాడి నేపథ్యంలో లాటిన్‌ అమెరికా దేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్యగా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. వెనిజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని విూడియా అమెరికా చెప్పిన కట్టుకతలనే వల్లిస్తున్నాయి. వెనిజువెలాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ బహుమతి వచ్చాక, అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుక పలుకులు పలికిస్తున్నది. పశ్చిమ దేశాల విూడియాకు అవే వేదవాక్కులుగా చెబుతున్నది. వెనిజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు అమెరికా సంస్థలు గత కొంతకాలంగా పాటపాడుతున్నాయి. డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అడ్మినిస్టేష్రన్‌ (డిఇఏ) తాజా నివేదికలో కూడా పేర్కొన్నది. అయితే ఐరాస వంద పేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అయినా సరే పశ్చిమ దేశాల విూడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ కథనాలు అందిస్తున్నాయి. నోబెల్‌ పురస్కారం అందుకున్న మచాడో ఎప్పటి నుంచో అక్కడ పోరాటం చేస్తున్నారు. దీనిని మాత్రమే సాకుగా చూపుతున్నారు. ఒకవేళ అదే నిజం అయితే అక్కడి పౌరులకే స్వేచ్ఛను ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. మచాడో నాయకత్వాన్ని సమర్థించి ఉంటే ట్రంప్‌ పరపతి పెరిగేది. గత పాతిక సంవత్సరాలుగా వెనిజులా కొరకరాని కొయ్యగా తయారైంది. క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది. మన దేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ బెదిరించటంతో 2025లో 81 శాతం తగ్గించింది. ఏతావాతా చూస్తే అక్కడి చమురు నిక్షేపాలను తన గుప్పిట పెట్టుకునే ఎత్తుగడతోనే ట్రంప్‌ దాడికి తెగించాడు. నిజానికి ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగిలేంత నిల్వలు వెనిజెవెలాలో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని, వ్యాపారం చేసివుంటే వెనిజులా గల్ఫ్‌ దేశాలను మించి ఆర్థికంగా ఎదిగేది. అయితే అక్కడి కమ్యూనిస్టులు దీనిని అడ్డుకోవడంతో దుర్భర పరిస్తితి ఏర్పడిరది. ప్రజలు వసలపోయే వరకు వచ్చింది. చావెజ్‌ వచ్చాక ఈ దుస్థితి ఏర్పడిరది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే. తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడు తుండటంతో క్రమంగా అమెరికా వాటిని దెబ్బతీస్తున్నది. వెనిజులాను ఆక్రమించటం ప్రపంచ బలహీనతకు చిహ్నంగా చూడాలి. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్‌ సంక్షోభం వెల్లడిరచింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది. ఈ రెండూ కలసి వాషింగ్టన్‌ను సవాలు చేస్తున్నాయి. మెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి. చైనాను దెబ్బ తీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనిజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు. మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్‌ విూద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్‌లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు ట్రంప్‌ తీరుతెన్నులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరో మలుపు తిరుగుతాయి. మొత్తం విూద చెప్పాలంటే చైనాకు చమురు దొరక్కుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉందని, వెనిజెలాపై దాడితో స్పష్టం అవుతోంది. భారత్‌ విూద తాను ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలుసని ఈ సందర్భంగా ట్రంప్‌ చేసిన ప్రకటన నరేంద్ర మోడీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ను తానే ఆపివేయించానని పదే పదే చెప్పిన ట్రంప్‌ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు. ఒకవైపు పాకిస్తాన్‌, మరో వైపు నుంచి బంగ్లాదేశ్‌ను మన విూదకు ఉసిగొల్పుతున్నాడు. అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్‌ మదురోతోనే ప్రారంభం కాలేదు. ఇదే ఆఖరిదీ కాబోదు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అస్థిర పరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది. ఉక్రెయిన్‌, పాలస్తీనాలోని గాజా, వెస్ట్‌ బ్యాంక్‌, కాంగో, సూడాన్‌లో దాడులు, అంతర్యుద్దాలు, రష్యా, ఇరాన్‌, వెనిజులా లపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం, సోవియట్‌తో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అనేక దేశాల విూద దాడులకు పూనుకోవటం, సిరియా, లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయిల్‌ మారణకాండకు మద్దతు, ఇరాన్‌పై దాడి, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవం. మొత్తం విూద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది.
గ్రీన్‌లాండ్‌ స్వాధీనం.. పరిశీలనలో సైనిక ఆప్షన్‌: వైట్‌హౌస్‌
గ్రీన్‌లాండ్‌ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు గ్రీన్‌ల్యాండ్‌ వ్యూహాత్మకంగా కీలకమైందని, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమని అధ్యక్షుడు భావిస్తున్నారన్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకువెళ్లడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారని చెప్పారు. వెనెజువెలా నేత నికోలస్‌ మదురోను సైనిక ఆపరేషన్‌ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి గ్రీన్‌లాండ్‌ పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడం, గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్‌ ‘త్వరలో (ూూూఔ)’ అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతున్నాయి. దీంతో ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మక, ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటిక్‌ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.