జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు పక్రియ
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన పక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ పక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ పక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు. దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో ఈ జనగణన పక్రియను నిర్వహించాల్సి ఉంది. కానీ కొవిడ్ కారణంగా.. ఈ పక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనన గణన పక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ పక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనుంది. ఈ జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన పక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

