పురపోరులో సత్తా చాటాలి

` ఉపాధి హామీ చట్టం రద్దు చేసేంత వరకు పోరు ఆపొద్దు
` పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకే చట్టాన్ని తీసుకొచ్చారు
` పథకాన్ని మొదట అమలు చేసింది ఏపీ,తెలంగాణ రాష్ట్రాలే
` రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరుగుతాయి
` దాంతో కార్పొరేట్‌ కంపెనీలకు చవకగా కార్మికులు దొరుకుతారు
` పథకం పేరు మార్పు వెనక ప్రధాని మోదీ కుట్ర
` వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తిరస్కరిస్తూ గ్రామసభలు తీర్మానించాలి
` గాంధీభవన్‌లో పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌
` ఎస్‌ఐఆర్‌ వెనక పెద్ద కుట్ర ఉందని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): కార్యకర్తల కష్టం, త్యాగాలతోనే అధికారంలో ఉన్నామని.. వచ్చిన పదవులన్నీ కార్యకర్తలు ఇచ్చినవేనని చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 66 శాతంపైగా కాంగ్రెస్‌ గెలిచిందని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలవాలని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోడని తెలిపారు. కాంగ్రెస్‌ మంత్రులంతా కష్టపడి పైకొచ్చినవారేనని, పార్టీ అవకాశం ఇస్తే తనతోపాటు ఎవరికైనా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకాన్నే మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించం అని అన్నారు. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదు. ఉపాధి హావిూ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయమిదని అన్నారు. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని భాజపా నేతలు ప్రచారం చేశారు. అన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేసేవారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. ప్రజలను కాంగ్రెస్‌ అప్రమత్తం చేయడంతో భాజపా 240 సీట్ల వద్ద ఆగిపోయింది. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడిరది. ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ తీసుకొచ్చారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.ఉపాధి హావిూ పథకం వల్ల వెట్టిచాకిరి ఆగిపోయిందని, గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. అలాగే పనికితగ్గ వేతనం డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడిరదని పేర్కొన్నారు. దేశంలో 80 శాతం మంది ఈ ఉపాధి హావిూపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ వెనుక పెద్ద కుట్ర ఉందని.. వీబీ జీ రామ్‌ జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌) చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఉపాధి హావిూని రద్దు చేస్తే మళ్లీ వలసలు ప్రారంభ మవుతాయని హెచ్చరించారు. కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు, అదానీ`అంబానీలకు ప్రజలను కూలీలుగా మార్చేందుకు ఉపాధి హావిూని రద్దు చేస్తున్నారని విమర్శించారు. వికసిత్‌ భారత్‌ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాల విషయంలో క్షమాపణ చెప్పే వరకు వదల్లేదని.. ఇప్పుడు ఉపాధి హావిూ విషయంలోనూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆరోపించారు.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు
` ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహణ
` బాధ్యతలు మంత్రి పొంగులేటికి అప్పగింత
` మున్సిపల్‌ ఎన్నికలతో కాంగ్రెస్‌ సన్నద్ధం
` మారోసారి ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. మరికొన్ని రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే లక్ష్యంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు ఈ బహిరంగ సభలు నిర్వహించాలని తేదీలను ఖరారు చేసింది. ఈ బహిరంగ సభల సమన్వయ బాధ్యతను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపైనా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో గెలపు బాధ్యతలు తీసుకునేలా దిశానిర్దేశం చేశారు. వీటిని పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ విూనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కట్టబెట్టింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు వేదికగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలను ఆహ్వానించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మండలాల్లో సైతం ఈ సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక మండలం బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని.. ఈ వ్యవహారంలో రేవంత్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రనేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు తిప్పికొట్టేందుకు ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈ సభల వేదిక విూద నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మీ తదితర పథకాలు అమలును వివరించడం ద్వారా ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్ట వచ్చనే లక్ష్యంలో ఈ కీలక నిర్ణయాన్ని ఆ పార్టీ తీసుకుంది. అంతేకాకుండా.. ఆయా జిల్లాల్లోని స్థానిక సమస్యలతోపాటు పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టమైన హావిూ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామంటూ ఆయన ఇప్పటికే విూడియా వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. అలాంటి వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ కంటే ముందే భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా ఆ పార్టీ అగ్రనాయకత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.