భారత్‌పై బాదుడు 500శాతానికి..
` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్ ఆమోదం!
` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి
వాషింగ్టన్(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే చర్యల్లో భాగంగా ఇండియాపై భారీ సుంకం విధించేందుకు దాదాపు రంగం సిద్దమైపోయినట్టు కనిప్తిసోంది.రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠిన తరం చేసే చర్యల్లో ఆ దేశం నుంచి చమురు కొంటున్నదేశాలపై ముఖ్యంగా ఇండియాపై 500 శాతం సుంకం విధించే బిల్లుకు ట్రంప ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.బుధవారం వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యానని, నెలల తరబడిగా జరుగుతున్న బిల్లుకు ట్రంప్ మద్దతు తెలిపారని అమెరికా రిపబ్లికన్ సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ గ్రాహం చెప్పారు. ఈ పరిణామాన్ని వైట్ హౌస్ అధికారి కూడా ధృవీకరించారు. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌లోని యుద్ధాన్ని ముగించేం దుకు, శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. అక్కడ శాంతి కోసం తమ ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. పుతిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నా, అమాయకులను చంపుతూనే ఉన్నాంరంటూ గ్రాహం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ బిల్లు ఆమోదం ఎంతవరకు సాధ్యమవుతుందో స్పష్టత లేనప్పటికీ, వచ్చే వారం ప్రారంభంలోనే ఓటింగ్ జరగవచ్చని కూడా చెప్పారు. రష్యా దగ్గర చమురు కొనడం అంటే ఉక్రెయిన్‌కు మద్దతు నిరాకరించినట్టే భావిస్తున్నామన్నారు.రష్యా చమురు వాణిజ్యానికి భారతదేశంపై 500శాతం సుంకాన్ని విధించే గ్రాహం`బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు ఆమోదం పొందితే. భారతదేశం, చైనా , బ్రెజిల్‌తో సహా ఇతర దేశాలపై 500 శాతం వరకు సుంకాలను విధించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది.రష్యా చమురు లేదా యురేనియం కొనుగోలు చేయడం అంటే ‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ యంత్రానికి ఇంధనం’’ ఇచ్చినట్టేనని గ్రాహం తెలిపారు.
రష్యా ఆంక్షల బిల్లు
ప్రధానంగా గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ ఈ బిల్లుకు రూపకల్పన చేశారు. రష్యా చమురు, గ్యాస్, యురేనియం ఇతర ఎగుమతులను కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు, ద్వితీయ ఆంక్షలు విధించడానికి ట్రంప్ ప్రభుత్వానికి అనుమతి లభిస్తుంది. దీని వల్ల రష్యా సైనిక చర్యలకు నిధుల మూలాన్ని నిలిపివేయడమే అవుతుంది.రష్యా చమురులో 70 శాతం భారత్, చైనాలే కొంటున్నాయి. గత ఏడాది ఆగస్గులో రష్యానుంచి చమురుకొనుగోలుచేస్తున్న నేపథ్యంలో భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే.
గ్రీన్‌లాండ్‌ను కొనేస్తాం
` స్వాధీనంపై పట్టువీడని ట్రంప్
` అమెరికా కసరత్తు ముమ్మరం
` ఒప్పుకోకుంటే సైనిక చర్యే..
` వచ్చే వారమే డెన్మార్క్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో
` అక్కడి ఖనిజ నిక్షేపాలపై అగ్రరాజ్యం కన్ను
వాషింగ్టన్(జనంసాక్షి): డెన్మార్క్ దేశంలోని గ్రీన్‌లాండ్ ప్రాంతాన్ని కొనే దిశగా అమెరికా కసరత్తును ముమ్మరం చేసింది. దీనిపై ఆ దేశ ప్రభుత్వంతో చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే వారం డెన్మార్క్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈవిషయాన్ని గ్రీన్‌లాండ్ ప్రాంతీయ ప్రభుత్వ వెబ్‌సైట్ మంగళవారం రోజే (జనవరి 6న) ధ్రువీకరించింది. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రస్‌మ్యూసెన్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్ ఫెల్ట్‌ల విన్నపం మేరకు డెన్మార్క్ పర్యటనకు రూబియో వస్తున్నారని వెల్లడిరచింది. ఈ సున్నితమైన అంశంపై చర్చ కోసం డెన్మార్క్‌కు రావాలని ఇంతకుముందు పలుమార్లు ప్రభుత్వం విన్నవించినప్పటికీ అమెరికా తిరస్కరించిందని తెలిపింది.
గ్రీన్‌లాండ్ స్వాధీనానికి అన్ని మార్గాలు సిద్ధం
సోమవారం సాయంత్రం (జనవరి 5న) వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ఓ ప్రైవేటు సమావేశం జరిగింది. అందులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం రోజు(జనవరి 6న) ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సంచలన వార్తను ప్రచురించింది. ఎలాగైనా డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ను కొనేయాలనే స్పష్టమైన ఆలోచనతో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారనే విషయాన్ని రూబియో చెప్పారని ఆ వార్తలో ప్రస్తావించారు. గ్రీన్‌లాండ్ స్వాధీనానికి సైనిక చర్యను చేపట్టొద్దనే బలమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నందున, దాన్ని కొనేయాలనే అభిప్రాయానికి ట్రంప్ వచ్చారని రూబియో తెలిపినట్లు వార్తలో పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ స్వాధీనం కోసం తమ వద్ద అన్ని మార్గాలు సిద్ధంగా ఉన్నాయని మంగళవారం రోజు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరోలిన్ లీవిట్ వెల్లడిరచారు. అయితే దౌత్యానికే ప్రెసిడెంట్ ట్రంప్ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు.
గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదన పాతదే : రూబియో
కీలక విషయాలన్నీ అప్పటికే వెలుగులోకి వచ్చేయడంతో, బుధవారం రోజు (జనవరి 7న) ఇవే అంశాలను విలేకరులకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా తెలియజేశారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయిన నాటి నుంచే గ్రీన్‌లాండ్‌ను కొనే అంశం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారని ఆయన వెల్లడిరచారు. గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదనను పరిశీలిస్తున్న తొలి ప్రెసిడెంట్ ట్రంప్ కాదని, గతంలోనూ పలువురు అమెరికా అధ్యక్షులు ఈ అంశాన్ని పరిశీలించారని రూబియో చెప్పారు. గ్రీన్‌లాండ్ కోసం నాటో కూటమికి దూరమయ్యే రిస్క్ తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా, ఇలాంటి అంశాలపై తాము నేరుగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలతో చర్చిస్తామన్నారు. అమెరికా జాతీయ భద్రత కోసం సైనిక చర్యలకు ఆదేశించే అధికారం ప్రతి అమెరికా అధ్యక్షుడికి ఉంటుందన్నారు.
డెన్మార్క్‌కు మద్దతుగా ఐరోపా దేశాలు
గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్ దేశాలు ఇప్పటికే డెన్మార్క్‌కు మద్దతును ప్రకటించాయి. తమ గ్రీన్‌లాండ్‌ను అమెరికా లాక్కుంటే, నాటో కూటమే అంతమవుతుందని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సన్ హెచ్చరించారు.
ఇక ఇదే అమెరికా
గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమించుకోవడం ఈజీయా? కాదా? అనే దానిపై డెన్మార్క్‌లోని రాయల్ డానిష్ డిఫెన్స్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ థామస్ క్రోస్బీ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లోని ఉత్తర ప్రాంతంలో అమెరికాకు ‘పిటుఫ్పిక్ వైమానిక స్థావరం’ ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ సైనిక చర్య కోసం ట్రంప్ నుంచి ఆ వైమానిక స్థావరానికి ఆదేశాలు అందితే, అందులోని అమెరికన్ సైనికులు డెన్మార్క్ ఆర్మీతో ఘర్షణకు దిగకపోవచ్చన్నారు. అమెరికన్ సైనికులు నేరుగా గ్రీన్‌లాండ్ రాజధాని నగరం న్యూక్‌లోకి ప్రవేశించి, ఇక ఇది అమెరికా అని ప్రకటిస్తే సరిపోతుందని థామస్ క్రోస్బీ అభిప్రాయపడ్డారు. కేవలం 500 నుంచి 1000 మంది సైనికులతో ఈ పనిని అమెరికా పూర్తి చేయగలదన్నారు. కానీ ఈ విధమైన చర్య వల్ల ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలకు అమెరికాపై నమ్మకం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ఈ మార్పు దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. కాగా, డెన్మార్క్ ఆర్మీలోని అన్ని విభాగాలకు చెందిన సైనికుల సంఖ్య 90వేల లోపే. ఇందులోనూ వాలంటీర్లు, రిజర్వ్ సిబ్బందే ఎక్కువమంది ఉంటారు. యాక్టివ్ ఆర్మీ సైనికుల సంఖ్య దాదాపు 20వేలే. దేశ భద్రత కోసం అది పూర్తిగా నాటో కూటమిపై ఆధారపడి ఉంది.
’గ్రీన్‌లాండ్’లోని ఖనిజ నిక్షేపాలపై అమెరికా కన్ను
డెన్మార్క్‌లోని స్వయంపాలిత ప్రాంతం ‘గ్రీన్‌లాండ్’ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రం, ఆర్కిటిక్ మహా సముద్రం మధ్యన ఉంది. ఇందులో దాదాపు 57వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే జనసాంద్రత చాలా తక్కువ. ఇక్కడి జనాభాలో దాదాపు సగం మంది స్థానిక రాజధాని నగరం న్యూక్‌లో నివసిస్తుంటారు. గ్రీన్‌లాండ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచురాశుల కింద దాదాపు 34 కీలకమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని యూరోపియన్ యూనియన్ (ఈయూ) గుర్తించింది. ఈ నిక్షేపాల జాబితాలో బంగారం, జింక్, ఐరన్, సహజ వాయువు వంటివి ఉన్నాయి. వీటి కోసమే గ్రీన్‌లాండ్ కొనుగోలుకు అమెరికా ఆసక్తి చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా ప్రతిపాదనను గతంలో గ్రీన్‌లాండ్ పాలకులు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఈసారి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డెన్మార్క్ పర్యటనలో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చైనా, రష్యా నౌకాదళాలు ఆర్కిటిక్ మహాసముద్రంలో తిరుగుతున్నాయనే అంశాన్ని బూచిగా చూపించి, గ్రీన్‌లాండ్‌ను అమ్మేలా డెన్మార్క్‌ను అమెరికా ఒప్పించగలుగుతుందా అనేది వేచిచూడాలి.


